ఆ జీవితం ఓ సుందర నందన వనమే..? :- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
"ధనమేరా 
అన్నిటికీ మూలం 
ఆ ధనము విలువ 
తెలుసుకొనుట మానవ ధర్మం"
అన్నడో తెలివిగల తెలుగుకవి...

ఆ ధనమే పెట్టుబడైతే...
ఒక శ్రమ విందుకు 
సిద్ధమయ్యే వంటశాల...
మౌనంగా పనిచేసే 
ఒక సంపద యంత్రం...

ఒక మాట చాలు... 
అది మంత్రదండమే...
ఒక చుక్క చాలు... 
అది అమృత భాండమే...
ఒక మెతుకు చాలు... 
అది ఆకలితీర్చే అక్షయపాత్రే...

పెట్టుబడి మంత్రాన్ని
ప్రతినిత్యం జపించండి...
రేపటి పచ్చని పంటకది బీజం...
రాబోయే కాలానికి అది పునాది...

శ్రమను శాస్త్రంగా 
అధ్యయనం చేసి 
క్రమశిక్షణతో ధైర్యంతో...నేడు 
మీరు దాచే చిన్నమొత్తాలే...రేపు 
కుంభవర్షాలై కురిసే కారుమేఘాలు...

అదే మీకు సిరులొలికే 
ధన ధాన్యలక్ష్మి చల్లని ఒడి...
అదే విజ్ఞానపు వెలుగుల్ని నింపే 
సరస్వతీమాత కొలువైఉండే బడి... 
అదే కోరిన కోర్కెలు తీర్చే 
తల్లి కనకదుర్గమ్మ గుడి...

క్రమశిక్షణకు కట్టుబడి...
పెడితే ఒక్క పెట్టుబడి...
అది అక్షరాలా మీ భవిష్యత్తును  
ఒక "అక్షయ పాత్రగా" మారుస్తుంది...

పొదుపు మదుపైతే...
అది మీ పిల్లల విదేశీ విద్యకో...
కన్నకూతురు కన్యాదానానికో...
సొంతింటి కలల సాకారానికో...
పదవీ విరమణకు ఓ నిధిగానో...
మలిసంధ్యలో ఓ దారిదీపంగానో...
అవసరానికో ఔషధంగానో మారుతుంది

అదృష్టమే అనుకూలిస్తే...
పెట్టుబడి ఫలాలు" దక్కేది మీకే...
తరగని ఆ ఆస్తి ఓ అమృతభాండమే...
ఆపై మీ జీవితం...సుగంధ భరిత...
సుఖసంతోషాల..సుందర నందనవనమే... 

నేడే క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టండి ..!
కోటి ఆశలతో కంచుకోటలు కట్టండి..!
పుట్టినందుకు గట్టి మేల్ తల పెట్టండి..?
కోటీశ్వరులుగానే మళ్ళీమళ్ళీ పుట్టండి.?
రేపు రాజులా బ్రతికేందుకిదే రాచబాటండి.



కామెంట్‌లు