పెరిగిన హోదా!!:- ఎం. వి.ఉమాదేవి
 (చిట్టిపొట్టి కథలు -1)
================
రంగారావుగారి మనవడు శ్రీతేజ  తమ ఫ్రెండ్ వివేక్ ఇచ్చాడని ఓ తెల్లని కుక్క పిల్లను తెచ్చి పెంచుతున్నాడు. బొద్దుగా ముద్దుగా ఉంటుంది.
" కుక్కలు పిల్లులు మనకి యెందుకు రా? ఇల్లు పాడు చేస్తాయి." అని తేజ నాన్న వినయ్ అన్నాడు కానీ కొడుకు ముచ్చట కోసం, దాన్ని వెటర్నరీ డాక్టర్ కి చూపింది యాంటీ వార్మ్ మందులు, రేబిస్ వ్యాక్సిన్ చేశారు. 
 ఇక పొద్దునే అందర్నీ భౌ భౌ అని లేపడం తాత గారితో వాకింగ్ చేయడం అలవాటు చేసారు.
 వచ్చాక దానికి 
పాలూ బిస్కెట్స్ వేయడం, గ్రిల్స్ వరండాలో దానికో మూలన అట్ట పెట్టెకి రంగు కాగితాలు అంటించి అలంకరణ చేసి, దానిలో పాత టీ షర్టులు పరిచి పడక ఏర్పాటు చేశాడు.  ఇక అప్పటి నుండి ఇంట్లో ఒకటే హడావిడి. ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్లు మోగిస్తే చాలు...
కుక్క పిల్ల టామీ ఒకటే అరుపులు! 
" వచ్చిందీ మనకి తెలిసిన వారే కదా? అలా అరుస్తుంది యెందుకు తాతయ్య గారూ?" అన్నాడు శ్రీతేజ.
"ఏమీ లేదురా ! అదెక్కడ నుండో వచ్చిందీ. దానికో లెక్కుంది. ముద్దు చేసే యజమానిగా నువ్వున్నావు. టైం టూ టైం పాలూ పెట్ ఫుడ్ పెట్టే మీ అమ్మా, నాన్నమ్మ ఉన్నారు. మొన్నటి వరకూ అది ఒట్టి కుక్కే! ఇపుడు దానికో పేరు కూడా ఉంది టామీ అంటూ. ఇక చక్కని పడక గది చల్లని ప్రదేశం లో మకాం వేసి ఉంది కదా! ఇపుడు దానికో ఇల్లు ఉందీ,  హోదా పెరిగినట్టు అనిపించింది. అందుకే ఎవరైన బైట వారు వస్తే ఎవడ్రా నువ్వూ అన్నట్టు బిల్డప్పు! " అని తాతయ్య అనేసరికి అటు శ్రీ తేజ, ఇటు నాన్నమ్మ పడీ పడీ నవ్వుతున్నారు.

కామెంట్‌లు