ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు తాము పని చేస్తున్న ప్రాంతాల్లో గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులతో స్నేహభావంతో మెలగాలని, ప్రజల సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సాధ్యమవుతుందని
జిల్లా రిసోర్స్ పర్సన్ ఈర్ల సమ్మయ్య అన్నారు. బుధవారం ముత్తారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంఈఓ ఎన్.హరిప్రసాద్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి ఈర్ల సమ్మయ్య పరిశీలకులుగా వెళ్లారు. శిక్షణ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించి, పలు విషయాలను నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఆర్పీ ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రజల ఆస్తి అని, పాఠశాలల ప్రాముఖ్యత, ప్రత్యేకతలను ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు. పాఠశాలలోని విజయగాధలను విస్తృతంగా ప్రచారం చేయాలని, దండోరా వేయించడం, కరపత్రాలు, పంచడం, వాల్ రైటింగ్ చేయించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి వాటిని వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని, దీనివల్ల పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. తర్వాత ఎంఈఓ ఎన్.హరి ప్రసాద్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు చెప్పిన ప్రతి అంశాన్ని నోట్ బుక్ లో రాసుకొని, వాటిని తాము పని చేస్తున్న పాఠశాలల్లో పగడ్బందీగా అమలు చేయాలని, ఆయన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను కోరారు. పాఠశాల పిల్లలకు ఆసక్తికరంగా, కృత్యాధార బోధనాభ్యసన ప్రక్రియలను కల్పించి, ఎఫ్ఎల్ఎన్ లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఇంటింటా తిరుగుతూ, పిల్లల తల్లిదండ్రులను చైతన్య పరుస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఈఓ హరిప్రసాద్ కోరారు. అనంతరం ఎంఈఓ హరిప్రసాద్ మండల ఆర్పీలతో కలిసి డీఆర్పీ ఈర్ల సమ్మయ్య ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్లు కుళ్ల రాజేందర్, జినుక వెంకటేష్, జి.ప్రసుమతి, కానుగంటి అంజయ్య, ఇ. లక్ష్మణ్, బి.తిరుపతి, ఎస్. శ్రీధర్, బి.ఓంకార్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సీసీఓ సంపత్, సీఆర్పిలు కుమార్, శ్రీనివాస్, సమ్మయ్య, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి