శ్రీ సాయినాధుని లీలామృతం :-సి.హెచ్.ప్రతాప్
 సాయి భక్తుల్లో ప్రముఖుడు అయిన నాసిక్ వాసి శ్రీ సఖారాం బల్వంత్ ధుమాల్ వృత్తిరీత్యా న్యాయవాది. మహారాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఆయనకు విశేషంగా పలుకుబడి ఉండేది. బూజు పట్టిన దురాచారాలను ఖండిస్తూ, సమాజాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినవారిలో ధుమాల్ ఒకడు. 1917 నుండి 1925 వరకు నాసిక్ జిల్లా ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు చైర్మన్‌గా పనిచేసిన తొలి ప్రభుత్వేతర వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. ఈ పదవిలో పని చేసిన కాలంలో, తన స్వంత లాయర్ ప్రాక్టీసుకు తగినంత సమయం కేటాయించలేకపోయాడు. అయినా, అభివృద్ధి బోర్డు బాధ్యతలు తీసుకుని రాత్రింబవళ్ళూ నిస్వార్థంగా కృషి చేశాడు. ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకురావడం ద్వారా నాసిక్ జిల్లా అభివృద్ధికి కీలక పాత్ర పోషించాడు.
ధుమాల్ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అతనికి “రావ్ బహద్దూర్” బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించింది. 1925 తర్వాత, చైర్మన్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి, తిరిగి తన ప్రైవేట్ లాయర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. బాబా దయ వల్ల అతని వృత్తి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ధన సంపదలతో పాటు మంచి ఖ్యాతిని కూడ ఆర్జించగలిగాడు.
ధుమాల్ మిక్కిలి ఆచారవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. చిన్నప్పటి నుంచే అతని కుటుంబమంతా షేగాం లోని యోగి శ్రేష్ఠుడు శ్రీ గజానన్ మహారాజు భక్తులు. 1907లో, మిత్రుల ప్రోద్బలంతో శిరిడీ వెళ్లిన ధుమాల్ మొదటిసారి శ్రీ సాయిబాబా దర్శనం పొందాడు. తొలి దర్శనంతోనే బాబాపట్ల తీవ్రమైన ఆకర్షణ కలిగింది. మొదటిసారి సాష్టాంగ నమస్కారం చేయగానే బాబా రెండు రూపాయలు దక్షిణగా అడిగారు. వెంటనే అందించిన ఆ డబ్బును ఆశీర్వదించి తిరిగి అతనికి అందిస్తూ, “వీటిని బద్రంగా భద్రపరచుకో. నీకు జీవితంలో ఎలాంటి లోటూ ఉండదు,” అన్నారు. ఆ మాటలు ధుమాల్ జీవితానికి మలుపు తెచ్చిన  ఆయుధాలు అయ్యాయి.
ధుమాల్, నాగ్‌పూర్‌లో నివసించే బాపు సాహెబ్ బూటీకి అత్యంత సన్నిహితుడు. ఒకసారి బూటీని శిరిడీకి తీసుకెళ్లి సాయి దర్శనం చేయించాడు. ఆ దర్శనం బూటీ జీవితానికీ ఒక గొప్ప మలుపు తీసుకొచ్చింది. ధుమాల్ వలెనే బూటీ కూడా సాయిబాబాపట్ల ఆకర్షితుడై, జీవితాంతం ఆయనకు ఘనమైన భక్తుడిగా మారాడు.
శ్రీ ధుమాల్ జీవితంలో శ్రీ సాయిబాబా కృప చాలా కీలకమైన పాత్ర పోషించింది. భక్తి, విశ్వాసం, నిస్వార్థ సేవ అనే మూడు మూల సూత్రాలతో జీవించిన ధుమాల్‌కి సాయి అనుగ్రహం ఎల్లప్పుడూ అండగా నిలిచింది. ధనికుడైనా, ప్రజాసేవకు విలువ ఇచ్చినవాడిగా, ఆధ్యాత్మికతతో నిండి ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించవచ్చు.

కామెంట్‌లు