చూపుల పూలు!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
జ్ఞాపకాల సమాధుల ఎదల పై
చూపుల పూలు చల్లి చిరునవ్వుల కన్నీళ్ళ మాలలు అల్లి 
ఎండిపోయిన గుండె ఫిరంగుల మోతల
తలపులు తెరిచి దుఃఖం చీకట్లో 
దీపాన్ని వెతుక్కుంటూ వెలుగు అలిగిపోయింది. 

మసక మసక చీకటి మనసుకు పేరుకుపోయి 
నల్లని మసిలా మనసు కరిగిపోయింది. 

జ్ఞాపకాల స్పర్శలతో గుర్తిస్తూ జ్ఞాపకాల వాసనలతో సాగుతూ 
నిన్నటి రంగుల జీవాన్ని పసిగట్టి 
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆకాశాన్ని సృష్టిస్తున్న 
మనసు ఇంకా అలసిపోలేదు.

మబ్బుల్లా అల్లుకున్న మేఘాల్ని పిలుస్తూ 
నిన్న నాటిన విత్తనాలు ఒక్కొక్కటి మొలకెత్తుతుంటే 
నదుల్లా కదులుతున్న ఆత్మలు ఇంకా  అంతరించిపోలేదు.

పగిలిపోయిన పిలుపులు కరిగిపోయిన శబ్దాలు గడ్డ కట్టిన పెదవులు 
ఇంకా శిథిలమవ్వలేదు. దిక్కుల పక్కన నిలబడి నవ్వుతున్నవి. 

చివరి దృశ్యాలు చిగురులు తొడిగి నక్షత్రాల్లా మినుకు మినుకు మని మెరుస్తున్నవి. 

విరిగిపోయి ముక్కలు ముక్కలుగా చెదిరిపోయిన శ్వాసలు 
సంతోషాల నీడల్లో కదలాడుతున్నవి. 

విషాద గర్భాల్లో గాలి కూడా దూరని నిశీధిలో నిన్ను నన్ను కలుపుతున్న కాలం 
ఉక్కిరి బిక్కిరై మరణిస్తుంది. 

ఒక్కసారి ఎగిరి కూలిపోయిన పక్షి లా మనం ఇంకా మిగిలి ఉన్నాం. చూపుల పూలలా.

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు