రదీఫ్: వన్నెలరాణి:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
మిశ్రగతి గజల్
===========
వెన్నెల సోన వలపుల వీణ పరుగులేలనె వన్నెలరాణి
వీనులవిందు నీ గానమని పాడవేలనె వన్నెలరాణి

గిలిగింతలకు ఈసుపుట్టగ కిలకిలనవ్వు ఒలికించెదవె
మనోజ్ఞ సీమ విహారమందు మౌనమేలనె వన్నెలరాణి

మత్తెక్కించు మాధవీలత మెల్లగతాకి మురిసిపోయెను
జారిన పూల గంధము తెలిపె కినుకదేలనె వన్నెలరాణి

తపనలు తీర్చు చిటపట చినుకు సవ్వడి చేసి మేలుకొలిపెను
తీరము చేర్చు నావను చేర కదలవేలనె వన్నెలరాణి

నీవే నాకు వరమని పలుక నమ్మవేలనె ఓ జవరాల!
చింతను వీడి చెలిమిని పంచు అలకలేలనె వన్నెలరాణి



కామెంట్‌లు