ఉడుతా భక్తి: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఉడుతా భక్తి అంటే ఎవరికి వారు వారికి చేతనైనంత సహాయం చేయడం. అది రూపాయ కావచ్చు, వెయ్యి రూపాయలు కావచ్చు. నీ స్థితికి తగినంత సహాయం చేస్తే రెండూ సమానమే. చేయాలి అనే కోరిక ముఖ్యం. ఒక్కొక్క నీటి బొట్టే పెద్ద వానగా మారినట్లు అనేక మంది చేసే చిన్న చిన్న సహాయాలే పెద్ద మొత్తంగా మారిపోతాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు లాంటి అపదలు సంభవించి ప్రజలు వున్నదంతా కోల్పోయి వీధిన పడినపుడు... దేశమంతా ఒక్కటై చేతులు కలిపి చేసే చిన్న చిన్న సహాయాలే వాళ్ళ జీవితాల్ని నిలబెట్టి కొత్త జీవితానికి నాంది వేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు గూడా నా దగ్గర వున్నది చాలా చిన్న మొత్తం గదా... దీని వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం వుండదు అని భావించకుండా ఎవరికి వారు వారికి తోచినంత, చేతనైనంత సహాయం చేస్తూ ఆపదల్లో అండగా నిలబడాలి. ఏదైనా ఒక మంచి పని తలపెట్టినప్పుడు మనవంతుగా మనం అందించే ఈ తోడ్పాటునే ఉడుతా భక్తి అంటారు.
ఈ జాతీయం మన ఇతిహాసమైన రామాయణ గాధ నుండి వ్యాప్తి చెందింది. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలోని అశోకవనంలో బంధించాడు. శ్రీరాముడు సీతాదేవి జాడకోసం వెదుకుతూ సుగ్రీవునితో స్నేహం చేసి అతని శత్రువైన వాలిని సంహరించి కిష్కింధ నగరానికి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుడు రామునికి ఇచ్చిన మాట ప్రకారం సీతాదేవిని వెదకడానికి సైన్యాన్ని నాలుగు వైపులా పంపించాడు. దక్షిణం వైపు వెళ్ళిన హనుమంతుడు అడ్డం వచ్చిన సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. అశోకవనంలో సీత వున్నది కనుక్కొని తిరిగివచ్చి రామునికి చెప్పాడు. రాముడు లంకపై దండెత్తడానికి వానర సైన్యంతో బైలు దేరాడు. సముద్రాన్ని దాటడం కోసం దారి ఇవ్వమని వేడుకున్నా సముద్రుడు లెక్కచేయలేదు. దాంతో ఆగ్రహించిన రాముడు సముద్రం మీదకు బాణం ఎక్కు పెట్టాడు. భయపడ్డ సముద్రుడు చేతులు జోడించి రాముని ముందు ప్రత్యక్షమై తనపై వేసే రాళ్ళు, చెట్లూ అన్నీ నీటిలో తేలేలా చేస్తానని వారధి కట్టి సముద్రం దాటమని చెప్పాడు. దాంతో వానరులంతా పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఆనకట్ట కట్టడం మొదలు పెట్టారు. ఈ కథంతా ఇక్కడ ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా... ఇక్కడే మన అసలు కథ మొదలయ్యేది అందుకన్నమాట.
వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఆనకట్ట కడుతున్నారు గదా... అక్కడ ఒక చెట్టుమీద ఒక చిన్న ఉడుత వుంది. దానికి రాముడంటే చానా ఇష్టం. తానుగూడా రామునికి ఆనకట్ట కట్టడంలో సహాయపడాలి అనుకొంది.
కానీ ఉడుత ఎంతుంటాది. మన పడికెడంత. అది సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. కానీ ఆ ఉడుత అట్లా అనుకోలేదు. రాముడు చేయబోయే 
ఈ మంచి పనికి తాను తోడుగా నిలబడాలి అనుకొనింది. వెంటనే పోయి ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని ఒళ్ళంతా ఇసుక అంటుకోగానే సంబరంగా వురుక్కుంటా ఆనకట్టమీదకు పోయి, అక్కడ ఇసుకంతా విదల్చసాగింది. అట్లా ఆ ఉడుత ఒక్క క్షణం గూడా ఆగకుండా అలసిపోకుండా మరలా మరలా చేయసాగింది.
రాముడు ఆ ఉడుత భక్తిగా చేస్తున్న పనిని చూశాడు. దాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు లక్ష్మణునికెళ్ళి చూసి "చూశావా... తమ్ముడు... ఇది నిజమైన భక్తి అంటే. ప్రతి ఒక్కరూ ఇలా తమంతట తాము, తనకు చేతనైనంత సహాయం చేస్తూ మంచి పనులకు మద్దతుగా నిలబడాలి. అప్పుడే లోకంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. మనకు ఏం చేతనవుతుందిలే, మనం సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత, మనం సహాయం చేసినా అది పెద్దగా ఉపయోగపడదులే... ఇలాంటి భావనలు వదలుకోవాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. " అంటూ ఆ ఉడుత వీపు మీద ప్రేమగా మూడు వేళ్ళతో నిమిరాడు.
అంతకు ముందు వరకు ఉడుతకు వీపుమీద చారలు వుండేవి కాదంట. రాముడు ఎప్పుడైతే సంతోషంగా నిమిరాడో ఆ చేతివేళ్ళ గుర్తులు ఉడుత మీద పడి అట్లాగే శాశ్వతంగా వుండిపోయాయట. ఇప్పటికీ మనం ఉడుత వీపుమీద గుర్తులు చూడవచ్చు. అప్పటినుంచీ చిన్నదైనా పెద్దయినా ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే దానిని ఉడుతా భక్తి అంటారు.
*********

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం