తిండిపోతు పోరడు :- -కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
  ఓ పల్లెటూల్లో  ఓ పోరడుండేటోడు. ఆడు వొట్టి ఫోరంబోకు. పనిపాట లేక ఉల్పగా తిరిగేది. ఆనికి పొద్దస్తం తిండి మీద యావ తప్ప మరోటి వుండేది కాదు. ఊళ్లే యాడ దావతున్నా పిల్వకున్నా సరే పోయి, ఒక్కడే ఇద్దరి మందం తినేది. పిల్సినా, పిల్వకున్నా యెల్లి పొట్టపగిలేటట్టు బేవ్ వచ్చిం దాంక తినేది. ఈని సంగతి వురంతా యెర్కే. ఆ వుళ్ళేకల్ల యే దావత్ వొయినా యెవ్వలేం అనేటోల్లు గాదు. గీ పోరడు రోజూ తెల్లారంగనే యవ్వనింట్ల యే దావతైతుందో అని ఎదురుజుశేటోడు.
       ఇగ ఈని ముచ్చట గిట్లండగా... ఆ ఊళ్ళో ఒకసారేమైందంటే బాగా డబ్బున్నాయనకు పుట్టక పుట్టక కొడుకు పుట్టిండు. అందుకని అయన మస్తు సంతోషంతోటి  వూరు సాంతిమి దావత్ ఇయ్యాలనుకుండు. పెద్ద పెద్ద సల్వ పందిర్లు యేపిచ్చిండు. బోలెడన్ని మేక పోతులు కోపిచ్చిండు.             బగారన్నం కోడికూర, శాపల పుల్సు కూడా వొండిచ్చిండు. ఇంక తీరొక్క వంటకాలు, రకరకాల స్వీట్లు జేపిచ్చిండు.వురంతా గప్పున కమ్మటాసన వచ్చేలా జోర్దార్ గా దావత్ యెర్పాటు జేసిండు. అస్సోంటి దావుత్ ను గా ఊరోళ్లు ఎప్పుడూ కూడా జూడలే!
వూరు వూరంతా సీమలోలే కదిలోచ్చి భోజనాలు జేసీండ్రు కడుపునిండ. తినివోయటప్పుడు గా దావత్ ఇచ్చినాయినను మస్తుగా మెచ్చుకుంట బోయినరు.
             ఇగ మన తిండివోతోని  సంబురమైతే అంతింతా గాదు. సెప్ప నలవి కాదు సుమా!.తెల్లారక ముందే వోయి దావతింటికాడ కాప్ల కాస్కుంట గూసుండు.తొలి బంతి లోనే కూసోని,యే ఒక్కటి ఇస్పెట్టకుండ అడిగి మల్ల మల్ల పెట్టిచ్చుకుండు. కుతికెల దాంక తిన్నడు. సోలుకుంట సిన్నగా లేసి మూతన్న కడుకోకుండ యెల్లి దూరాన ఓ సెట్టుకాడ  అడ్డంవొరిగిండు. అట్లనే గుర్రువెట్టి నిద్రవోయిండు. పొద్దుగూకినంక మేల్కొచ్చింది. గప్పుడూ కూడా ఆఖరి బంతి అయితుంటే మల్లవోయి అల్ల గూసుండు. కడుపు పగిలేటట్టు  బిర్రుగా తిని ఇంటితోవ వట్టిండు.
       తిండి యెక్కువై ఆయసం తోటి అడుగుల అడిగేస్తు అటు ఇటు సోల్తు నడ్వలేక నడుస్తుండు. అమ్మ!అయ్య!అనుకుంట కల్లు తాగిన కోతిలెక్క తిక్క తిక్కగా  వోతుండు. పోత పోత ఒక ఇంటి ముందు అరుగుల మీద గూసుండు. నడిసే ఓపిక లేక మూలుగుతున్న  ఈణ్ణి జూసి ఆ ఇంటామే బయటకొచ్చి   బాగా ఆయాస పడుతున్నవ్ గదా!నోట్లే గింత సోంపు యేస్కో తగ్గుద్ది. పెట్టమంటావా!అని అడిగింది. దానికి తిండివోతోడు ఓగిరిచ్కుంట వొద్దులే అమ్మ! అనుకుంట మల్లి సోయి తప్పి పడిండు. ఆ ఇంటామే నోరు దెర్సి "కడుపుల పట్టేంత తినాలే గానీ, పుకడికి వొచ్చిందని తింటే గట్లనే వుంటది. మల్లేప్పుడూ గిసొంటి పని జేయకు."అని గట్టిగా మందలిచ్చింది. ఇగ..  అప్పటి నుంచి దావత్ లకు పోకుండా, ఒక వేళ వోయినా మోతాదులో తింటూ, దొర్కిన పని జేసుకుంట మంచిగ బతకడం  నేర్సుకుండు.
   

కామెంట్‌లు