అంతర్జాల బాల కథా సమ్మేళనంలో తిరుమలరావు

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, 
కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు కథారచయితగా అంతర్జాతీయ బాల కథా సమ్మేళనంలో, కథను వినిపించే ఘనమైన అవకాశం పొంది, ప్రశంసాపత్రం సాధించారు. 
ఆంధ్ర సారస్వత పరిషత్  అంతర్జాతీయ అధ్యక్షులు డా.కేశిరాజు శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ముఖ్యసమన్వయకర్త డా.కేశిరాజు రామప్రసాద్ నేతృత్వంలో అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో తిరుమలరావు  పాల్గొని తన కథను వినిపించి అందరి ప్రశంసలు పొందారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్ తొలుత కథలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన మతలబ్ అనే కథ ఎంపికైంది. పదివేల రూపాయలను అప్పు తీసుకుని, తీసుకోలేదని అసత్యమాడిన ఒక తండ్రి బాకీని, కుమారుడు తీర్చివేసే నిజాయితీ గూర్చి తన మతలబ్ కథలో నీతి అని తిరుమలరావు తెలిపారు. ఆ కుమారుడు పదోతరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచినందున పూర్వ విద్యార్ధుల సంఘం అందించిన నగదు పారితోషికాన్ని మోసగాడైన తండ్రి బాకీని తీర్చి, బాల్యం నుంచే సహృదయత ఉండాలనే సందేశం తన కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు. తండ్రికి తెలియకుండా ఆ బాకీని తీర్చడం విశేషం. ఐతే తండ్రి ఎవరివద్ద ఐతే డబ్బులు తీసుకున్నాడో ఆ వ్యక్తి ఎదురైనప్పుడు, నీ బాకీ తీర్చేసావు ధన్యవాదాలు అని అనడంతో బాకీ తీరిందంటాడేమిటీ ఏమిటబ్బా ఈ మతలబ్బూ అనుకుంటూ అయోమయంలో ఉండిపోవుటే ఆ తండ్రి నీచ బుద్ధికి తగిన శిక్ష అంటూ తన మతలబ్ కథను వినిపిస్తూ ముగించారు తిరుమలరావు. నూట ఏభై కథకులు ఐదు గంటలపాటు పర్యావరణం, నీతి, ప్రకృతి, తల్లిదండ్రులు, గురువులు, దేశభక్తి, సామాజిక హితం, సైన్స్, కాల్పనిక, సందేశాత్మక, హాస్యం వంటి ఇతివృత్తాలుగా బాల కథలను వినిపించగా అందులో తిరుమలరావు కూడా, తన కథారచనను వినిపించి మిక్కిలి అభినందనలు పొందారు. ఈ అంతర్జాతీయ బాల కథా సమ్మేళనంలో ప్రముఖ కథా రచయితలు డా.కె.శ్రీనివాస్, డా.కె.రామప్రసాద్, పట్రాయిడు కాశీవిశ్వనాథ్, గుడిపూడి రాధికారాణి, డా.వి.పురుషోత్తం, పి.వెంకటేశ్వర్లు, వురిమళ్ళ సునంద, వంగా సుధీర్ మోహన్, శ్రీనివాస వంశీ, పుల్లా రామాంజనేయులు తదితరులు బాల కథా సాహిత్యం ఆవశ్యకతను వివరించారు.
కామెంట్‌లు