వేట : సరికొండ శ్రీనివాసరాజు

 శ్రీపురం రాజ్యాన్ని మోహనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు తీరిక సమయాలలో వేటకు వెళ్లి, అడవిలో రకరకాల జీవులను వేటాడి, తీసుకు వచ్చి, వండించుకుని తినేవాడు. ఆ అడవిని పరిపాలించే సింహం, ఆ అడవి జీవులను ప్రాణంగా చూసుకుంటూ వాటికి వచ్చిన సమస్యలను పరిష్కరించేది.
     తన అడవిలో జంతువులు తగ్గి పోవడం సింహం గమనించింది.  దానికి కారణం తెలుసుకోమని కొన్ని గూఢచారి జీవులను నియమించింది. కారణం తెలుసుకుంది.  
    ఒక మాటలు నేర్చిన చిలుకను మహారాజు వద్దకు పంపింది. మహారాజు తన ఉద్యానవనంలో ఆహ్లాదంగా విహరిస్తూ పంపగా ఒక చెట్టు మీద చిలుక మాటలు వినిపించాయి. "మహారాజా! నమస్కారం.  మీలాగే మా అడవిని మా సింహం మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. అడవి జీవులను తన కన్న బిడ్డల్లా చూసుకుంటున్నాడు.  కానీ మీ వేట మూలంగా మా అడవిలోని జీవుల సంఖ్య తగ్గిపోవడం మా మృగరాజును కలచి వేస్తున్నది. దయచేసి వేటను మానేయమని మా రాజు వేడుకున్నారు." అన్నది చిలుక. 
    అక్కడే ఉన్న మహారాణి చిలుక మాటలకు ముచ్చట పడింది.  చిలుకను పిలిచి ఆప్యాయంగా చేతితో నిమిరి "నేను రాజుగారితో చెబుతాలే." అని చిలకను పంపించి వేసింది.  "రాజా! మృగరాజు తలచుకుంటే తన అడవిలోని క్రూర మృగాలను విష జీవులను అదును కనిపెత్తి జనాల మీదికి పంపించి, వారి ప్రాణాలు తీయించగలదు. కానీ క్రూర మృగరాజు కూడా తన అడవి జీవుల క్షేమం కోసం అలోచించడం నాకు ముచ్చటగా అనిపిస్తుంది. దాని మాట వినకపోతే మనం జంతువుల కన్నా క్రూర జీవులం అవుతాము.  ఆలోచించండి." అన్నది మహారాణి.  మహారాజు ఆలోచనలో పడ్డాడు. 

కామెంట్‌లు