న్యాయాలు -882
గురుకృత దండో న దోషావహః న్యాయము
*****
గురు అనగా మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు, శిక్షకుడు, బోధకుడు.గురు కృత గురువు లేదా శిక్షకుడి నిర్ణయము.దండో అనగా దండిస్తే.న అనగా కాదు, లేదు. న దోష అనగా తప్పు లేదు ,పాపము కాదు అని అర్థము.
గురువు గారు దండిస్తే దోషము లేదు.ఎందువలన అనగా గురువు దండించేది శిష్యుని అభివృద్ధి కోసమే కాబట్టి అని అర్థము.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దాం.
ఒకానొక గురువు దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో ఒక శిష్యుడు మాత్రం గురువు చెప్పేది వినక పోవడమే కాకుండా తోటి విద్యార్థులతో గురువు గురించి చెడుగా చెప్పేవాడు. అది విన్న మిగతా శిష్యులు గురువుకు అతడి గురించి చెబుతారు.కానీ గురువు అతడిని అస్సలు దండించకుండా ఏమీ పట్టనట్టు,అది పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా యథావిధిగా బోధన చేయసాగాడు.
మిగిలిన విద్యార్థులకు చాడీలు చెప్పే విద్యార్థిని గురువు గారు ఏమి అనకపోవడం బాధ, కోపం తెప్పించాయి.
ఒకరోజు గురువు దగ్గర చేరి "ఎందుకు ఆ విద్యార్థిని శిక్షింఛడం లేదని అడిగారు.అప్పుడా గురువు గారు వారితో వాడొక అజ్ఞాని. మీరంతా జ్ఞానవంతులు కాబట్టి మంచి చెడుల విచక్షణ తెలుసు.కాని అతడింకా అజ్ఞానం లోనే ఉన్నాడు. వాడిని సరైన మార్గంలో నడిపించేందుకు గురువుగా చేసే ప్రయత్నంలో చేసే భాగమే ఇది.మీరది గ్రహించక అతడిని శిక్షించడం లేదు అనుకుంటూ ఉన్నారు? అనగానే గురువు గారి గొప్ప తనం అర్థం చేసుకుంటారు.
మన భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత వహించేది గురువే. గురు స్థానం అన్నింటికంటే గొప్పది. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల/ శిష్యుల భవిష్యత్తు కోసం ఆరాటపడేది గురువే. ఇంటిలోని తల్లిదండ్రుల బాధ్యతను గురువుగా తానై వహిస్తాడు. అందుకే క్రమశిక్షణ లోపించి పక్కదారి పట్టినప్పుడు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి సరైన మార్గంలో నడిచేలా చూస్తాడు.
అలాంటి గురువు యొక్క ప్రాముఖ్యత, గొప్ప తనం గురించి ప్రజాకవి వేమన రాసిన కొన్ని పద్యాలు చూద్దామా!
"గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో/అజునికైన వాని యబ్బకైన/తాళపు చెవి లేక తలుపెట్లూడునో?/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా తాళం చెవి లేకుండా తలుపు తీయడం ఎలా సాధ్యం కాదో, గురువు శిక్ష లేదా శిక్షణ లేకుండా జ్ఞానాన్ని బ్రహ్మయే కాదు అతని తండ్రి కూడా తెలుసుకోలేడు అంటాడు వేమన.
ఈ మధ్య కాలంలో గురువుల మాటలను వినకపోవడము, వారికి నమస్కారం చేయాలనే సంస్కారం అనేది విద్యార్థుల్లో లోపించింది.అవసరమైనప్పుడు చేసే మందలింపును కూడా ఇష్టపడక విద్యార్థుల తల్లిదండ్రులు గురువులతో గొడవపడం చూస్తున్నాం.తల్లిదండ్రులకు ఎంత హక్కు, బాధ్యత ఉందో గురువుకు అంతే వుంటుందనేది తెలుసుకోవాలి.శిష్యులు ఉన్నతులుగా ఎదగాలనీ, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకునేది గురువులే.
అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు " ప్రేమించే హృదయం ఉన్న గురువుకు సరియైన మార్గములో నడిచేలా దండించే హక్కు కూడా ఉందని" అంటారు.
వేమన మరో పద్యంలో ."గురువు లేక విద్య గురుతుగా దొరకదు/నృఫతి లేక భూమి నియతి గాదు/గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనే?/....ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజు అనే వాడు ఉండాలి.నేరాలకు రాజు వేసే తగిన శిక్షల వలన రాజ్యంలో అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి.కాబట్టి రాజు లేకుండా రాజ్యపాలన సరిగా సాగనట్లే గురువు లేకుండా సరియైన విద్య లభించదు. మరి అలాంటి విద్య లభించకపోతే శిష్యుడు బ్రహ్మ జ్ఞాని ఎలా అవుతాడు? అంటారు.
మరి అలాంటి జ్ఞానం పొందాలంటే గురువుకు దగ్గరగా ఉండాలంటారు వేమన.ఆ పద్యాన్ని కూడా చూద్దామా.
"ఛాయ నొసగు జెట్లు సాధువు బోధలు/అడిగి దారిని జేర బడయవచ్చు/అత్తునిట్టు దాత నడిపోవు నిది రాదు/"... అనగా చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ నిస్తుంది.దూరంగా వెళ్ళిపోయిన వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు.అదే విధంగా గురువు కూడా తనను గౌరవిస్తూ,తన మాటలు శ్రద్ధగా వింటూ,తనకు సన్నిహితంగా వుండే శిష్యుడికి మాత్రమే విద్యను బోధించగలడు కానీ తన మాటలు లెక్క చేయకుండా తనకు దూరంగా వెళ్ళిపోయే విద్యార్థులకు గురువు బోధలు చేయలేడు కదా! కాబట్టి జ్ఞానం పొందాలనే, విజ్ఞానం సంపాదించాలనే కోరిక ఉన్న వారు గురువుకు దగ్గరగా ఉండాలని భావము.
ఇదండీ! "గురుకృత దండో న దోషావహః న్యాయము"లోని గొప్పదనం. ప్రతి విద్యార్థీ తెలుసుకోవలసిన విషయం.విద్యార్థుల తల్లి తండ్రులు కూడా గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలియ జేస్తూ వారి చూపిన బంగారం లాంటి భవిష్యత్తు బాటలో నడిచేలా చూస్తే ఉన్నత విలువలతో కూడిన సమాజం ఆవిష్కృతం అవుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి