మా అమ్మ సంఘసంస్కర్త:- సత్యవాణి

 ?గుర్తుకొస్తున్నాయి
===============
అవును మీరుచదివినది నిజమే!మా అమ్మ సంఘం గుర్తించని సంస్కర్త.ఏసంఘం
శాలువాలతోనూ,దండలతోనూ,బిరుదులతోనూ సన్మానించబడని సంస్కర్త.ఏఫోటోల లోకీ,ఏపేపర్లలోకీ ఎక్కని సంస్కర్త.తనపిల్లలను సంఘంలో సంస్కారవంతంగా,ధైర్యంగా,నిజాయితీగా తలయెత్తి మాట్లాడగలిగేలా పెంచిన మా అమ్మ నిజమైన సంఘసంస్కర్త.
    మా అమ్మ పన్నిండేళ్ళకే పెళ్ళిచేసుకొని అత్తారిఊరైన రౌతులపూడిలోని మాఇంట్లో  కాలుపెట్టిందిట.ఆమె  రౌతులపూడిలో కాలుపెట్టేసమయంలో ఊరివారికి వరిబువ్వఅంటే తెలియదట.జొన్నలలూ,గంటిలూ,కొర్రలూ మొదలైన చిరుధాన్యాలనే తినేవారట.మా అమ్మ ఆ అన్నాలు తినలేకపోతోందని,ఆమెకోసం మాతాతగారు బయటనెక్కడనుంచో వరి బియ్యంకొనితెచ్చి వండేవారట.మాఅమ్మ వచ్చేకానే,వర్షాలు సకాలంలో కురవడంవలన,మెరకలు పల్లాలుగా మార్చుకొని  వరిపంటను ఊరివారందరూ పండించడం మొదలుపెట్టారట. ఆ విషయం ఊరంతా చెప్పుకోవడమేకాదు,మాలచ్చింతల్లి అంటూ అమ్మని అందరూ గౌరవంగా చూసుకొనేవారు.
    మా ఊరిలో ఉన్నబ్రాహ్మణులంతా  ఒకరికొకరు కావలసినంతదగ్గర బంధువులైనా,ఏఒకరిద్దరిళ్ళవాళ్ళతో తప్ప, ఒకయింటివాళ్ళతో,మరొకఇంటివాళ్ళు మాట్లాడుకోవడంగానీ,పెళ్ళిపేరంటాలైనా ఒకరిళ్ళకు ఒకళ్ళు వెళ్ళడంగానీ వుండేదికాదు.చిన్నపిల్లలమైనా, మేముకూడా ఒక్క గోటేటారింటికీ,పెదవీర్రాజుమావయ్యగారింటికీ మాత్రమే వెళ్ళాలితప్ప,వాళ్ళ పిల్లలతోమాత్రమే ఆడుకోవాలితప్ప మరొకళ్ళింటికి వెళ్ళడంకానీ,వాళ్ళ పిల్లలతో ఆడటంమాటలావుంచితే,మాట్లాడినట్లుతెలిసినా,చెవిమెలిప్పటం,శొంటిపిక్కలు పెట్టడంచేసి,మళ్ళాఅలాచెేయమని చెంపలువాయించుకొనేదాకా వదిపెట్టేదికాదు మా నాయనమ్మ. మా ఇంటరుగు,మా నాయనమ్మ తమ్ముడి ఇంటరుగుకూ కప్పదాటు దూరంకూడా వుండేదికాదు.అయినా ఆ అరుగుమీదకు వెళ్ళేమో ఆరోజు మాపని అయిపోయినట్లే.అయితే తనతోటి మేనమావ పిల్లలతో ఆడుకోడానికి ఆకాలంలో మాచిన్నమేనత్త   బంగారమ్మగారు మాత్రం మేడమీద పిట్టగోడమీంచి దాటి, కాసేపుఆడుకొని చడీచప్పుడూ లేకుండాతిరిగివచ్చేసేదట.నేనుకూడా మా అత్తయ్యలాగే,పక్కఇంట్లోవుండే నా స్నేహితురాళ్ళైన  రత్నంకోసం,అమ్మల్స్ కోసం గప్ చిప్ గా పిట్టగొడదాటి ఆడుకు వచ్చెేసేదాన్ని అనేకసార్లు.
      అసలింతకూ ఒక ఊరివారూ,బంధువులైనప్పుడు కలసిమెలసివుండాలికదా!చాలా గ్రామాలలో అలాగే వుంటారుకదా!
        అవును,అలాగేవుంటారు.కానీ మారౌతులపూడి ఆరోజుల్లో పక్కా ఏజన్సీప్రాంతం.అటవీప్రాంతం,చుట్టూ కొండలు ఆక్రమించుకొన్నప్రాంతంకూడా!.మా అమ్మమ్మగారింట్లో మమ్మల్ని "అడివిమేళం అనేవాళ్ళు,కొండాళ్ళు అనికూడా అనేవారు. అంటే బాగా వెనుకబడినవాళ్ళమని,మూర్ఖశిఖామణులమని వాళ్ళకు మాపైన నమ్మకం.
      ఆరోజుల్లో మా ఉళ్ళలో చేతబడులూ,చిల్లంగులూ,మందులూ ,మాకులు పెట్టుకోవడంపై నమ్మకంఎక్కువ.ఏ విరోధంతో ఎవరు ఎవరికి ,ఎప్పుడు మందుపెడతారో,చెతబడిచేయిస్తారోనని అనుమానం,భయం. మూఢనమ్మకం.అది మాయింట్లోనేకాదు ఇంచుమించు మా ఊరిలో అందరిళ్ళలోనూ ఆభయంవుండేది.దాంతో ఒకరింటికి ఒకరెళ్ళడంకానీ,ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంగానీ జరిగేదికాదు.
      అలాంటి రోజుల్లో మా అమ్మ మా నాయనమ్మను కాదని,ఆమెకు తెలియకుండా మంచినీళ్ళకోసం చెలమకని వెళ్ళి ,మా ఇంటిపేరువారేఅయిన పూళ్ళవెంకటరావుగారింటికి గృహప్రవేశానికి వెళ్ళింది.ఆవిషయంతెలిసిన మానాయనమ్మ మా అమ్మపై నిప్పులు చెరిగింది.అప్పటికి నిజానికి మా అమ్మకు నిండా పాతికేళ్ళుకూడావుండవు.ఆవిధంగా ఒక్కొక్కరితోనూ,మాటా మాటా కలిపింది. ఇళ్ళలోని మా అమ్మవయసున్న కోడళ్ళు అందరూ కలిసి ఏటికి మంచినీటికెళ్ళడం మొదలైనవన్నీ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల మానాయనమ్మకి, మా అమ్మే ప్రథమ శత్రువుఅయ్యింది. .మా నాయనమ్మ బ్రతికినన్నాళ్ళూ,మాఅమ్మ బధ్ధవిరోధికూడా అయ్యింది ఆమెకు మా అమ్మ.  నాయమ్మ కాలం చెేసినతరువాత అందరిళ్ళకూ అందరూ రాకపోకలూ,ఇచ్చిపుచ్చుకోడాలు మొదలైయ్యాయి.మా పిల్లలంకూడా బడిలో ఔట్ బెల్ కొట్టగానే ఎవరింటికేనా వెళ్ళి మంచినీళ్ళు హాయిగా త్రాగొచ్చేవాళ్ళం.
     గుడిలోపూజల 
కూ,పండగలకూ,పేరంటాలకూ,మా అమ్మే నాయకురాలిలా ముందుండి ,అందర్నీ పోగుచేసితీసికెళ్ళేది.మా ఇంట్లో పెళ్ళిళ్ళకూ,పేరంటాలకు రావడానికి సరదాపడతారని,కోమటివారిని,కంసాలివారినీకూడా పిలిచేది.పంచిపెట్టడాలు వస్తే వారికికూడా పంచిపెట్టించేది.
    ఉపకారం అంటే ముందుండేది మా అమ్మ.మాఇంటిపక్కనుండే మా నాన్న మేనమామ మనవడు,సూరిబాబుకి  హైదరాబాదెళ్ళి 
సరోజనీదేవి కంటాస్పటల్లో కళ్ళాప్రేషన్ చేయించుకోడానికై రెండుసార్లూ డబ్బుయిచ్చింది.ఎనభైయేళ్ళుపైబడ్డా అతడు ఇప్పటికీ కరణీకం ఫెంక్షన్ తీసుకొంటూ మా అమ్మని ,తనుచేసిన సహాయాన్నీ  తలచుకొంటూనే వుంటాడు.అలాగే చిట్టివేంకటరావు మావయ్యగారబ్బాయి శ్రీహరిని, పట్టించుకొనేవారెవరూలేక ,పదోతరగతి పాసై ఉర్లో అల్లరిచిల్లరిగా తిరుగుతూ అల్లరిపడుతుంటే,     అప్పుడే ఆర్ .టి.సీ.బస్సులు వస్తున్నాయని తెలిసీ,కండక్టర్ పోస్ట్ లుంటాయని తెలిసి,అతడిని తనబంధువర్గమున్నఊరు రామచంద్రపురం తీసికెళ్ళి, గొల్లచంటిగారిద్వారా     ,ఎస్ .ఆర్ .ఎమ్ .టీ వారు నడుపుతున్న బస్సుల్లో కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నట్లుగా సర్వీస్  సర్టిఫికెట్ ఇప్పించింది.దానిద్వారా అతడు ఆర్ .టీ.సీ.లో కండక్టర్గా జీవితంలో స్థిరపడి ,పెళ్ళి,పిల్లలూ అంటూ బ్రతికినన్నాళ్ళూ సుఖంగా కాలంగడపడానికి సహాయపడింది మా అమ్మ.తన తల్లితండ్రులకు మా అమ్మంటే ఎంతగౌరవమో ఆ కండక్టర్ శ్రీహరి పెద్దకూతురు ఫణి చెప్పినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది.    
       మా అమ్మ మహా సాహసి అనికూడాచెప్పవచ్చు.అదెలాంటే, అయినింటి ఆడవాళ్ళు కోర్టు మెట్లెక్కడం మహానేరం ,ఘోరంగా చూసే ఆరోజుల్లో,అదీ ఊరిలో పెద్ద మోతుబరియైన,  ఊరి పెద్దగాఅందరిచేతా భావించబడే మా నాన్న పూళ్ళ వెంకటరాజనే కొండ్రాజుగారి భార్య ,అందునా పదిమందిసంతానంగల ఆమె,అందులో ఏడుగురు ఆడపిల్లలతల్లైన మా అమ్మ కోర్టు మెట్లెక్కింది.ఇది నమ్మలేని నిజం.
    అదెలాగంటే,తన పెద్దప్పగారైన బాలాంత్రపు సబ్బమ్మగారి మనవరాలికి మేనరికంగా బాల్యవివాహం జరిగింది. తరువాత ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగాకా ఆపిల్లభర్త ఆమెనుకాదని ,ఆమెకు తెలియకుండా,తనతోపాటు పనిచేసే ఆమెను రెండోపెళ్ళిచేసుకొని, ఇద్దరు మగపిల్లలనుకన్నాడు. అతడు మా రౌతులపూడి దగ్గరున్న బెండపూడిలో పశువులడాక్టర్ గా పనిచేసేవాడు.ఆరెండో భార్యకూడా అక్కడే అదే ఉద్యోగంచేసేది.పశువులవైద్యం నిమిత్తం మాఊరొచ్చినప్పుడు,మా అమ్మ తనభర్తకు బంధువని తెలుసుకొని,తన పిల్లలను తీసుకొని ఒకసారి మా రౌతులపూడిలోని మా ఇంటికివచ్చింది.విషయం తెలిసినా అమ్మ ఆమెను ఆదరించింది. మగాడు బుధ్ధిపూర్వకంగా మోసంచేసి నపప్పుడు ఆమెను నిందించడం అనవసరం అనుకొందో యేమో ఒక్కమాటకూడా అమెననలేదు.బహుశా ఆమె అతడికి తానూ భార్యగా మా అమ్మదగ్గర గుర్తింపును పొందాలనుకొందేమో!!ఎందుకంటెే,ఆ ఇద్దరిభార్యలభర్త మా అమ్మకు స్వయానా మేనత్త మనవడే!ఆవిధంగా మా అమ్మకు తెలిస్తే బంధువులందరిలో తానుకూడా అతడిభార్యగా గుర్తింపు పొందవచ్చునని ఆ రెండవ భార్య ఆశించివుండవచ్చు.అందుకనే మా అమ్మదగ్గరకి వచ్చివుండవచ్చు.
      అయితే అతడు మొదటిభార్యను,పిల్లల్నీ సరిగ్గాచూసుకోకపోవడంవలన,మా అమ్మ అక్కగారి మనవరాలు తనకూ,తనపిల్లలకూ పోషణనిమిత్తమై పెద్దలద్వారా కోర్ట్ కెళ్ళవలసివచ్చినప్పుడు, మా అమ్మకి అతడి రెండవ భార్య తెలుసుకనుక, గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ,భార్య అనుమతిలేకుండా రెండవపెళ్ళిచేసుకొని,ఇద్దరు పిల్లలు కలిగివున్నాడన్న విషయం మా అమ్మ
సాక్ష్యంగా కోర్ట్ లో చెప్పవలసివచ్చింది.
పేరుప్రతిష్టలుగల మా నాన్న మా అమ్మను కోర్ట్ లో సాక్ష్యానికి పంపించడం ఆరోజుల్లో అంటే,ఏభై అరవైఏళ్ళక్రితం.అదీ బంధువుల పిల్లకోసం సామాన్యమైన విషయంకాదు.అందునా పెళ్ళికావలసిన ఆడపిల్లలున్న మాఅమ్మ సాక్షిగా కోర్ట్ మెట్లెక్కడం అంటే ఆరోజులలో చిన్నవిషయంకాదు. అదీ నా తల్లితండ్రుల సంస్కారం.ఒక బంధువుల ఆడపిల్ల జీవితం నిలపడంకోసం మా అమ్మ ధైర్యంగా కోర్టుమట్లెక్కి సాక్ష్యంచెప్పింది.అందుకే మా అమ్మను సాహసి అన్నాను.
    ఇక్కడ మా అమ్మ మాటల్లోనే ,సరదాగా ఒకవిషయం చెప్పుకొందాం!
    "ఈ మొదటిభార్య అయిన అమ్మాయి నాఅప్పమనవరాలు..అదిసరే..తెలిసో తెలియకో మరో ఆడపిల్ల కూడా ఈ అబ్బాయిచేత పుస్తెకట్టించుకొంది.దానికీ పండుల్లాంటి ఇద్దరు మొగపిల్లలున్నారు. ఈ ఆడపిల్ల లిద్దరికీ కూడా న్యాయంచేయ్యాలి జడ్జీగారూ!"అని అమ్మ ఇంకా ఏదో చెప్పబోతుంటే, అవతలి ప్లీడరు మా అమ్మను కసురుకొన్నాడుట  .అప్పుడు ఆ జడ్జీగారు "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్ ? ఆమెనుచూస్తుంటే ఆమె ఏటువంటి కుటుంబంనుంచి వచ్చారో సాక్ష్యం చెప్పటానికి మీకు తెలియటలేదా?"అనిఆ ప్లీడరుని కసిరేరని,ఇంగ్లీషంటే తెలియని మా అమ్మ,ఇంగ్లీష్ లో జడ్జీగారి మాటలను తమాషాగా చెప్పి నవ్వుతుండేది.
       ఇక ఆరోజుల్లో మా రౌతులపూడిలో ఆడపిల్లలు ఐదోతరగతి  వరకూమాత్రమే చదువుకొని,పెళ్ళిళ్ళు చేసుకొని అత్తారిళ్ళకు వెళ్ళేవారు.
    కానీ మా అమ్మ చొరవతో,ఉమ్మడికుటుంబంలోని మా ఇంట్లో వాళ్ళందరినీ తీవ్రంగా ఎదిరించి,ఊళ్ళోవాళ్ళ సూటీపోటీమాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, "వయసొస్తున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళుచేసి అత్తారిళ్ళకేనా పంపించాలి,లేదా పెళ్ళిళ్ళు చేసేవరకూ చదివించాలని!"అనితానే ఒకసైన్యమై,ఎదురునిల్చి పోరాడి, తన
ఆడపిల్లలందరినీ ఉన్నతవిద్యావంతులను చేసింది.ఆమెకూతుళ్ళమైన మేమందరమూ ఈనాడు ఎవరికాళ్ళమీద వాళ్ళం నిలబడడమేకాదు ,అంతో ఇంతో, మరికొంతమందికి ,ఎన్నోవిధాలుగా సహాయపడగలగడంచూసి,పదిమందిలో "ఫలానావారి పిల్లల"ని గుర్తింపుపొందడంచూసి చాలా గర్వపడేది మాఅమ్మ.
      ఆ తరం మనిషైనా మా అమ్మకు, దిష్టిలూ, దిరుగుండాలూ, దిగదుడుపులూ,వాస్తులూ,జాతకాలూ అంటే నమ్మకం ఏమాత్రంలేదు. తొంభై ఏళ్ళక్రితంపుట్టిన మా అమ్మ పిల్లలెవరికీ దిష్టిలు తియ్యలేదు.జాతకమంటూ ఎవరిదగ్గరా తనచెయ్యిజాపలేదు."చేతులుచూసుకు చెడపొంగేరట"అంటూ జాతకాలమీద తన అయిష్టత స్పష్టంగా ప్రకటించేది.మూఢ నమ్మకాలకు మా అమ్మ ఆమడదూరం.
   నిప్పులుకడిగే చాగంటివారింటి ఆడబడుచైన మా అమ్మకి ,మొదట్లో పుట్టింటి ప్రభావంతో కొంచం ఆచారమున్నా,రాను రాను అర్దంలేని ఆచారాలను ఎన్నింటినో వదిలిపెట్టింది.
      మా చిన్నాన్న పోయాకా మాపిన్నితో,"బొట్టుపెట్టుకో ఓవిడా! ఎవరికైనా ఎదురుపడితే,వాళ్ళు మొహంతిప్పుకొంటే నువ్వు బాధపడతావు.అతేకాదు,నిన్నలా బొట్టులేకుండా చూస్తే మీ బావగారు చాలా బాధపడతారు."అని తోడికోడలుతో అన్నదంటే, మా అమ్మని సంఘసంస్కర్త కాదని ఎవరనగలరు?
      "కొనేటప్పుడూ,అమ్మేటప్పుడూ బారామూరా వుండాలనేది" మా అమ్మ సిధ్ధాంతం."కూరా నారా అమ్ముకొనేవాడు అవసరానికి అమ్ముకొంటాడు. వాడికేమీ లాభాలొచ్చిపడిపోవు.గీసిగీసి బేరంచేయకూడదన్నది" మాఅమ్మ మాట.అలాగే "అప్పులూ,చేబదుళ్ళూ ఇవ్వవలసివస్తే  కూడా చాలా ఉదారంగా వుండాలన్నది మా అమ్మ అభిప్రాయం."మనకి అలవికాని సహాయం ఎలాగా చేయలేం ఎవరికైనా.పదో,పరకో  అప్పని ఇచ్చినా,ఖచ్చితంగా తిరిగి రాబట్టుకోవాలనుకోకూడదు.వీలైతే ఇస్తారు,లేకపోతే లేదు.అనుకొని ఇచ్చేముందే అనుకొని ఇవ్వాలి అనేది.అలా అనుకొని అప్పిస్తే ,ఋణపడ్డామని తీసీకొన్నవాళ్ళకూ, వాళ్ళుమనకు ఋణపడ్డారనే భావంమనకూ కూడా అనిపించదనేది మా అమ్మ సిధ్ధాంతం.
      అంతేకాదు, ఈనాడు కూతురు పెళ్ళిచేసిన ప్రతితల్లీ, కూతురి అత్తింటివిషయాలను ఆరాతీస్తూ,అక్కరలేని జోక్యం కల్పించుకొని,వారి సంసార విఛ్ఛినతలో భాగస్థురాలౌతున్నారు.  వీరంతాఅతినాగరికత కలిగిన,అంతో ఇంతోచదువుకొన్న తల్లులే. చదువు లేవీ చదవకపోయినా, ఈనాటి తల్లుల్లాకాకుండా,ఏరోజూ తన ఆడపిల్లల అత్తింటి విషయాలలో జోక్యంకలిగించుకోవడంకానీ ,ఆడపిల్లల అత్తా ఆడబిడ్డల మంచిచెడ్డలగురించి  ఎంక్వైరీలు చెయ్యడంకానీ ఏనాడూ చెయ్యలేదంటే,ఆమె సంస్కారమెంతటిదో ఎవరికైనాతెలుస్తుంది. కనుకనే వారి అల్లుళ్ళు మా అమ్మానాన్నలపట్ల గౌరవాభిమానాలను కలిగివుండేవారు.
       సనాతన హిందూకుటుంబంలోపుట్టి ,ఆచారాలు పాటించే మా అమ్మ
"దేవుడొక్కడే!పేర్లే అనేకం" అనేది. ఏదైనా దేవుళ్ళకి నైవేధ్యం పెట్టేటప్పుడు మన నూటొక్క దేవుళ్ళందరితోపాటూ నైవేధ్యం పెట్టేదిఏసుబాబుకుకూడా. అలాగే మ్రొక్కులు మ్రొక్కేది.ముడుపులూ కట్టేది.
     అలాగే మా అన్నయ్యకు 'తండ్రిలేని పిల్లని,మేనల్లుళ్ళు చిన్న చిన్న వాళ్ళూ,చిన్నఉద్యోగస్థులూ అనే భావంతో ఇరుపక్షాల ఖర్చులూ,చివరకు మా ఆడపిల్లలకు ఇచ్చే లాంఛనాలతోసహా తనే పెట్టుకొని,తన పెద్దన్నగారైన చాగంటి గోపాలకృష్ణ గోఖలేగారి మూడోపిల్లను ,అదే మాపెద్దమావయ్యగారమ్మాయి సీతను కోడలిగా చేసుకొంది.దీన్ని బట్టి మా అమ్మ ఉదారత ఎంతటిదో మనకు తెలుస్తుంది. 
   "పరీక్షరాయడానికి వెళుతున్నాము,మీచేత్తో ఒక పదిరూపాయలివ్వండి."ఉద్యోగంకోసం,లేదా పెళ్ళిమాటలకు వెళుతున్నాం,మీరెదురు రండి" అంటూ, మాబంధువులు మా అమ్మ పట్ల వారికిగలగౌరవాన్నీ, ప్రేమను,ఆప్యాయతనూ ప్రకటించుకొనేవారు.ఆపదొస్తే భానక్క వుంటుంది,ఎంతోకొంత సహాయం తప్పక చేస్తుందని మా అమ్మపైన ఎంతోమ్మకం మా ఊరి బంధువులకు.ఆమె ఈనాడు  లేకపోయినా,చాలామంది మనసుల్లో మా అమ్మపట్ల ప్రేమాభిమానాలు కొల్లలుగా అలానే నిలచి వున్నాయని తెలిసినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.ఒక పల్లెటూరిలోపుట్టి,మరో పల్లెటూరిని మెట్టి,ఎనిమిది దశాబ్దాలుపైగా ఆ ఊరిలో అందరిచేతా 'ఔననిపించుకొంటూ'
బ్రతికి ,అలాబ్రతకడమెలాగో మాకు నేర్పించిన మా అమ్మ 
సంఘజీవేకాదు , సంస్కర్త అన్నది కాదనలేని నిజం.
         
కామెంట్‌లు