వెలిగించే వ్యక్తిత్వం…?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
ఒక కొవ్వొత్తిని వెలిగించినా...
ఒక అగర్‌బత్తీని అంటించినా...
గుడిలో ఓ ప్రమిద ప్రదీప్తమైనా...
దాన్ని “వెలిగించాం” అంటారు
కానీ "కాల్చాం” అనరు...!

కానీ...
ఒక ఇంటిని...
ఒక అడవిని...
ఒక గడ్డివామును...
ఒక చెత్త కుప్పను...
అగ్గిపుల్లతో తగలబెడితే...
దాన్ని “కాల్చేశాం”"దగ్ధం చేశాం”
"బూడిద చేశాం"అంటారు...కానీ “వెలిగించాం” అనరు..?

అగ్గిపుల్లతో వెలిగిస్తే..?
చీకటి తొలిగి వెలుగు విరజిమ్ముతుంది...
అదే అగ్గిపుల్లతో కాల్చేస్తే..?
చుట్టూ పొగ దట్టంగా కమ్ముకుంటుంది..!

ఔను అగ్గిపుల్లతో వెలుగుల్ని పంచవచ్చు
కారడవిని క్షణాల్లో కాల్చి బుగ్గిచేయవచ్చు

వెలిగించడం...
మానవత్వం...దైవత్వం...
కాల్చిబూడిద చేయడం...
మూర్ఖత్వం...దానవత్వం...

ఓ మిత్రమా...ఇప్పుడు 
నీ చేతిలో అగ్గిపుల్ల ఉంది…
వెలిగిస్తావో కాల్చివేస్తావో నీ ఇష్టం...
కానీ నీది వెలిగించే వ్యక్తిత్వమా...? 
మాడ్చి మసిచేసే మనస్తత్వమా తేల్చుకో.



కామెంట్‌లు