సిరి చందనమేదో చిలకరించినట్టు
విరి తేనెలు మనకై తెచ్చినట్టు
సిరిమువ్వలు ఎదలో మోగినట్టు
తొలి కిరణం వచ్చి తాకేను.
చిరుగాలితో కలిసిన వెచ్చదనం
విరితావులు పంచే కమ్మదనం
చిరునవ్వుల విరిసే ఆనందం
తెలి వెలుగులు నింపే మకరందం.
కాసారపు నిరీక్షణ ఫలించి
మదిలోనే కొలువుంటానంటూ
దివి దారిని సాగే రవి
దిగి వచ్చేనేమో కరుణించి!
వేడుక చూడగా వరుసగా వేచిన
వేల తరువులకు ముచ్చటతీరగా
వేయి వెలుగులు అనుగ్రహించే
కానుకగా దొరికిన కాంతికలశం!
నింగిని పరచుకున్న నారింజరంగు
సడి చేయక గడి తీసే తూరుపున
నేలను మేలుకొలిపే నాదస్వరమై
ఇలను ఇంపుగా వెలుగును నింపె!
నవకాంతుల శుభారంభం
నలుదిక్కులకు తొలి సందేశం
నరులకు మరో అవకాశంగా దొరికే
నభోమణి ఆగమన సంరంభం!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి