సంకెళ్లను ఛేదించిన ధీర..... ఆమె!:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
ఆమె అడుగులకు గండిపెట్టే బేడీలు,
యుగాలుగా కట్టిన కట్టడి గోడలు!
మౌనంగా మిణుగురులా మగ్గాలని,
మనసు మాటను మందలో ముంచాలని,
గడప దాటని గొలుసులో బంధించాలని,
ఎన్ని ఎన్ని అడ్డంకులు, అనుమానాలు,
అణచివేతల వలలో!

దేవుడు రాసిన విధి కాదిది,
మనిషి సృష్టించిన కృత్రిమ రేఖలు!
సమాజం గీచిన సరిహద్దు గీతలు,
స్త్రీ జీవనానికి సంకెళ్లని వేసినవి.
కానీ, 
ఈ యుగంలో ఆమె ఆగలేదు....

విజ్ఞాన జ్ఞానంతో వికసించింది,
చైతన్య జ్వాలతో చరిత్ర రాసింది.
ఆకాశమే హద్దుగా ఎగిరిన ఆమె,
అంతరిక్షంలో అడుగిడిన ఆమె,
శాస్త్రంలో, కళలో, నాయకత్వంలో,
అడుగడుగునా అసాధ్యాలను సాధించిన ఆమె.
లక్ష్మణరేఖలను లఘించి,
అవరోధాలను అలవోకగా ఛేదించి,
స్వేచ్ఛను ఆయుధంగా స్వీకరించింది.

ఆమె గమనం అగ్నిపథం,
ఆమె ధీరత్వం అజేయం!
ఈ నవయుగంలో ఆమె లక్ష్యాలు,
అస్త్రాలై అడ్డున్న గోడలను కూల్చాయి.
ఇక ఆధిపత్య రేఖలు ఆమెకు లొంగవు,
సంకెళ్లు ఆమె స్వప్నాలను ఆపలేవు.

స్త్రీ శక్తి స్వతంత్ర గీతం ఆలపిస్తోంది,
ప్రతి అడుగూ పురోగతి పథంలో సాగుతోంది.
ఇక ఈ కట్టుబాట్లు,
 ఈ లక్ష్మణరేఖలు,
ఆమె జీవన గమనానికి అడ్డు కాదు—
ఆమె స్వేచ్ఛే ఆమె సరిహద్దు,
ఆమె ధైర్యమే ఆమె గీతం!
________


కామెంట్‌లు