కవితాప్రస్థానం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితచదివితే
విందుభోజనం చేసినట్లుండాలి
కవితవింటే
కర్ణాలకింపు కలిగేలాగుండాలి

కవితచెబితే
శ్రోతలను కట్టిపడేసేలాగుండాలి
కవితపాడితే
గాంధర్వగానం ఙ్ఞప్తికితెచ్చేలాగుండాలి

కవితరాస్తే
అంతరంగాలను తాకేలాగుండాలి
కవితకూర్చితే
మల్లెమాల మత్తుచల్లినట్లుండాలి

కవితనాస్వాదిస్తే
చెరకురసం త్రాగినట్లుండాలి
కవితననుభవిస్తే
పనసతొనలు తిన్నట్లుండాలి

కవితపంపితే
ప్రముఖపత్రికలలో ప్రచురించేలాగుండాలి
కవితచేతికొస్తే
పాఠకులుపఠించి పరవశపడేలాగుండాలి

కవితపోటీలకుపంపితే
ప్రధమబహుమతి పొందేలాగుండాలి
కవితకుప్రాచుర్యమొస్తే
పిలిచి పురస్కారాలందించేలాగుండాలి

కవితవంటబడితే
కొత్తకవులు కలంపట్టేలాగుండాలి
కవితాసంకలనంతీసుకొస్తే
సాహితీలోకాన్ని సుసంపన్నంచేసేలాగుండాలి

కవితనుచిలికితే
పాలుమీగడలు తేలేలాగుండాలి
కవితనుమదిస్తే
అమృతభాండాగారం నిండేలాగుండాలి

కవితనుక్రోలితే
భృంగాలకు మధువుదొరికినట్లుండాలి
కవితనుపొగిడితే
సాహిత్యలోకం సంబరపడేలాగుండాలి 

కవితాజల్లులుకురిస్తే
కమ్మదనాలు వరదలాపారేలాగుండాలి
కవితచరిత్రకెక్కితే
కవిని సాహిత్యసింహాసనమెక్కించేలాగుండాలి


కామెంట్‌లు