అక్షరాలతో
అందంగా ఆరంభింపచేస్తావా
ఆనందంగా అంతంచేస్తావా
అనూహ్యంగా అలరింపజేస్తావా
పదాలతో
ప్రొద్దున్నే ఉదయించుతావా
అస్తమించకుండా నిలుస్తావా
ప్రతిరోజూ పులకరింపజేస్తావా
వాక్యాలతో
వెలుగుకు ద్వారంతెరుస్తావా
చీకటికి తలుపుమూసేస్తావా
కాంతులు వేదజల్లుతావా
చరణాలతో
పరవశాలు చేకూరుస్తావా
పరితాపాలు తొలగిస్తావా
ప్రసన్నతను కలిగిస్తావా
ఆలోచనలతో
ఉరతావా ఊరించేస్తావా
ఎండకుండా సాగుతావా
జీవనదిగా ప్రవహిస్తావా
భావాలతో
బయటకు వస్తావా
అంతర్ముఖుడవు కాకుంటావా
భ్రమల్లో ముంచుతావా
ఉత్సాహంతో
మదుల్లోనికి ప్రవేశిస్తావా
హృదయంనుండి నిష్క్రమించకుంటావా
గుండెల్లో గుబాళిస్తావా
సత్యాలతో
స్థిరమయి నిలిచిపోతావా
మాయమవకుండా ఉండిపోతావా
సూక్తులు తెలుపుతావా
కవితలతో
మౌనము దాల్చమంటావా
మాటలు కురిపించమంటావా
స్పందనలు పంపమంటావా
సాహితితో
సన్నిహితంగా ఉండమంటావా
సుదూరంగా జరిగిపోవద్దంటావా
సౌమ్యంగా సహవాసంచేయమంటావా
సంతసంతో
నన్ను తీసుకెళ్ళావా
నీ లోకానా
నన్ను వెలిగించవా
దయతో
అన్యాదా భావించకుండా
నన్ను ఆవహిస్తావా
నీలా మారుస్తావా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి