సామెతల ఊట - సునందమ్మ నోట:- వురిమళ్ల ( భోగోజు)సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-3: -అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

****
"అవ్వా! అవ్వా! రంగయ్య మావోళ్ళు బుడ్డోడిని తీసుకుని వచ్చిండ్రు. గుసగుసగా అంటున్న భూలచ్మితో " ఆడు నీ కలాసేగా.నీ వయ్యి( పుస్తకం )ఓటి పట్కరా. ఆడితో సదివిద్దాం" అనగానే జింక పిల్లోలె చెంగున వెళ్ళింది.
రామయ్య వాళ్ళ ఎదురుంగ స్టూలు పీట మీద కూసుంటూ "  ఏరా బుడ్డోడా! హీరో లెక్కున్నవ్.గా మాటలకు మరింత ఫోజు పెట్టిండు. ఆనెక్క (తర్వాత )నమల్తున్న నోటిని కనిపెట్టి " ఏంట్రా? ఏదో మేక నమిలినట్టు  నముల్తున్నవ్? అనంగనే చటుక్కున ఆపిండు.
నువ్వు మా భూలచ్మి ఒకటే కలాసంట గద.గీ వయ్యి తీసి గడగడ ఏదైనా చదువురా మనవడా!"అని ఇస్తుంటే తెల్ల మొహం వేసుకుని అమ్మ నాయిన వంక చూసిండు.
"ఫికర్ జేయకు. నేనేమననులే. భూలచ్మితో ఆడుకో పో!" అని పంపించి "ఏమే చంద్రీ! నీ కొడుక్కి "అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేనట్టుంది." అంది.
అంటే ఏందవ్వా! సమజవ్వలే!" అన్న రామయ్య మాటలకు" అన్నపు చొరవే అంటే తిండి మీద ధ్యాస,ఇష్టమే గాని సదువు మీద ధ్యాస లేదు. "మాలావు( చాలా) గార్బం ( గారాబం) ఎన్న కాల్సుక తిన్నట్టుంది" మీ కత అంది.
కత అనంగనే చెవి వారిచ్చి గదేందో చెప్పమని అడగబట్టిండ్రు.
సూటిగా ఆళ్ళకే తాకేట్టుగా" మీలాంటోళ్ళే ఇద్దరు ఆలుమగలు ఓ గుడిసెలో ఉండే వారు. వాళ్ళకి మీ వోడంత కొడుకు.  మా లావు గావురం చేసేవారు. ఓనాడు వెన్న కాల్సుక తింటనని పట్టుబట్టిండు. "దాన్ని జాగర్తగా కాల్సాలిరా" లేకుంటే ప్రమాదమైతదని ఎంత చెప్పినా యినకుండా  కాలుస్తానని చెంగడబింగడ ఎగురబట్టిండు. పిలగాడి గోల తట్టుకోలేక సరే అన్నరు.
గుడిసెలో అన్నం ఉడికే పొయ్యి కాడ కందిపుల్లలు తెచ్చి మంట బెట్టిండు. దాని మీద వెన్న గిన్నె బెట్టిండు. మంట పెరిగింది గిన్నెకు అంటుకుంది.నెయ్యి మంట కాస్తా గుడిసెకు అంటుకుంది. మొత్తానికి ముగ్గురు ఎట్లనో బయటపడ్డరు గని గుడిసె గాలిపోయింది.
కత ఇనంగనే వాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలిసి కొడుకు గురించి ఆలోచనలో పడ్డారు.
 అందుకే మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే ఇలాంటి గావురాలు చేయకూడదు అంటుంటారు ."అన్నపు చొరవ (తిండియావ) నుండి అక్షర  చొరవకు మనసు మళ్ళించాల్సిన పని పెద్దోళ్ళదే అని.
కామెంట్‌లు