నవ్వుల చిట్టా:- గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం
నవ్వులులేని
మోములెందుకు
పువ్వులులేని
మొక్కలెందుకు

నవ్వలేని
నరులెందుకు
నీరులేని
బావులెందుకు

నవ్వులుచిందని
జీవితాలెందుకు
సుఖాలుకూర్చని
కార్యాలెందుకు

నవ్వించని
మాటలెందుకు
రుచించని
భోజనమెందుకు

నవ్వులుకురిపించని
నాటకాలెందుకు
హాస్యంచూపించని
సినిమాలెందుకు

నవరసాలలోనవ్వు
ఒక ఎత్తు
మిగిలినరసాలు
మరో ఎత్తు

నవ్వులు
దీపాలు
పువ్వులు
పొంకాలు

నవ్వులను
చిందించు
పువ్వులను
చల్లించు

ముఖాలకు నవ్వులు
ఆభరణాలు
దేహానికి నగలు
అలంకారాలు

శిశువులనవ్వులు
సంబరము
బుడతలనడకలు
సంభ్రమము

నవ్వులపాటను
రచించు
శ్రావ్యగీతమును
వినిపించు

నవ్వులారవిందాలు
చిమ్ము
నెమలినాట్యాలు
చూపు

ఎప్పుడూ నవ్వులను 
దాచకు బంధించకు
ఎన్నడూ కెవ్వుమని 
కన్నీరును కార్చకు

రోజూ నవ్వుతూ
కాలము గడుపు
నిండు నూరేళ్ళూ
బ్రతుకుబండి నడుపు

నవ్వటం
ఒక భోగము
నవ్వలేకపోవటం
ఒక రోగము

నవ్వుల వెలుగులు
మానవత్వపు ముత్యాలు
అందరికీ అందించు
జీవితం పండుగగా సాగించు


కామెంట్‌లు