వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
109. మహాసక్తిః (చతురక్షరీ)
110. కుణ్డలినీ (చతురక్షరీ)
నూట పదవ నామ మంత్రము:
ఓం కుణ్డలిన్యై నమః
కుణ్డలినీ = చెవులకు ధరించు ఆభరణము.
శ్రీమాత, తన రెండు చెవులకు మొసలి ఆకారములో గుండ్రముగా చుట్టబడి, మొసలి యొక్క తోక ముఖము వైపు వచ్చి, ఆ తోక ఆధారముగా చెవులకు అలంకరించబడిన కుణ్డలములతో దర్శనం అనుగ్రహించింది. అలా కర్ణాభరణాలైన కుణ్డలములతో కనిపించిన అమ్మను చూసి వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "కుణ్డలినీ" అని కీర్తించారు. ఆ విధంగా "కుణ్డలినీ" గా కీర్తించబడిన పరాభట్టారికకు నమస్కారము.
అమ్మ వాగ్బీజస్వరూపం కదా! వాగ్బీజాక్షరం అయిన "ఐం" కూడా "కుణ్డలము" గానే చెప్పబడుతుంది. మూలాధార చక్రము నుండి సుషుమ్న నాడి అనబడే తామరతూడు వంటి సన్నని దారమును ఆధారముగా చేసుకుని, స్వాధిష్ఠాన చక్రము గుమ్మంలో, పొడవైన పాము మూడు చుట్టలుగా చుట్టుకుని, తోక భాగముతో తన ముఖాన్ని కప్పుకుని ఉన్న పరమేశ్వరి యొక్క శక్తి "కుణ్డలినీ" గా పిలువబడింది. ఈ స్థితిలో అమ్మ, అగ్ని తేజస్సుతో సమస్తశక్తులకూ, సకలజీవులకూ జ్ఞాన సంపద పంచుతూ, "కుణ్డలినీ" శక్తిగా ఉంది.
ఇంతకు ముందు అనుకున్నట్టు, "కుణ్డలినీ శక్తి" అగ్ని తత్వము తో కూడి, సర్ప రూపంలో ఉంటుంది. అందువల్ల, కుమారస్వామిని తన అధిదేవత గా కలిగి ఉంటుంది. మూలాధారంలో కుణ్డలినీ శక్తి నిద్రాణంగా ఉంటుంది. అందువల్ల మానవులు, నేను, నాది, నా వలననే పనులు అన్నీ జరుగుతున్నాయి అనే అజ్ఞాన భావనలో, పాంచభౌతిక కోరికలతో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ స్థితిలో, అమ్మ దయవలన, పరమేశ్వరి నామం పలకాలి అనే స్పృహ కలిగితే, మనలో జ్ఞాన శక్తి ద్వరాలు తెరుచుకోడానికి మార్గం ఏర్పడుతోంది అని భావించాలి.
ఆ విధంగా మొదలైన పరమేశ్వరి నామ జపము స్థిరమైతే, ముందు జన్మలలోని పుణ్యవాసన తోడైతే ,పరబ్రహ్మమును తెలుసుకోవాలి అనే కోరిక స్థిరపడుతుంది. అప్పుడు, సద్గురువు అనుగ్రహం దొరికి, పరమేశ్వరి యొక్క సాధనా మార్గాన్ని మనం పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలు పెడతాము.
మూలాధారము లో పృథివీ తత్వము అంటే అమ్మ ఉంటుంది. ఈ మూలాధార చక్రమునకు అధిపతి, గణపతి. స్వాధిష్ఠాన చక్రము అగ్ని తత్వము. కుమారస్వామి అధిపతి. అంటే, పరమేశ్వరి, ఆమె కుమారులు అయిన గణపతి, కుమారస్వామి ఒక దగ్గరే దర్శనం ఇస్తున్నారు కదా! తల్లీ, "బిడ్డలు ఒక చోటే ఉండాలి. వారిని వేరు చేయడం పకృతి విరుద్ధం" అని పరాత్పరి చెప్పకనే చెబుతోంది. అందుకనే అమ్మ "కుణ్డలినీ" అయ్యింది.
సాధకుడు, తన సాధనా శక్తి వలన ఈ తల్లీ బిడ్డలను సహస్రార పద్మము లో, మణిపూర పట్టణంలో త్రికోణం మధ్యలో వున్న అయ్య, సదాశివ పరబ్రహ్మ స్వరూపం అయిన శివయ్య దగ్గరకు చేర్చుతాడు. తాను, పరమానందాన్ని అందించే పరమాత్మ లోకానికి చేరి, పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకుని, జన్మరాహిత్యాన్ని పొందుతాడు.
తన వల్లనే ప్రేరణ, ప్రోత్సాహం పొంది, సాధనా మార్గాన్ని పట్టుకుని, తనను చేరుకోవాలి అని "కుణ్డలినీ" రూపంలో ఉన్న తనను నిద్రాస్థితి నుండి మేల్కొలుపుతున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం కుణ్డలిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి