ఇబ్రహీంనగర్ అనే చిన్న గ్రామంలో నిఖిల్, లత అనే అన్నాచెల్లెళ్ళు తమ తల్లిదండ్రులైన రంగయ్య, రమలతో కలిసి సంతోషంగా నివసించేవారు. రంగయ్య వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఇద్దరు పిల్లలూ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు.
ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా, ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆపి అడిగారు.
"అమ్మా! నీ పేరేమిటి? ఏ పాఠశాలలో చదువుతున్నావు?" అని అడిగారు.
"నా పేరు లత. మా అన్న పేరు నిఖిల్. మేము ఇద్దరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం" అని లత చెప్పింది.
"మీరు మా పాఠశాలలో చేరండి. మేము చాలా బాగా చెప్తాం. పైగా మిమ్మల్ని బస్సులో తీసుకెళ్ళి తీసుకొస్తాం" అని ఉపాధ్యాయులు చెప్పారు.
అందుకు నిఖిల్ దృఢంగా సమాధానమిచ్చాడు. "మేము మా ప్రభుత్వ పాఠశాలను వదిలి మరెక్కడికీ రాము. పైగా మా పాఠశాలలో మరింత మంది చేరేలా మేమే ఇంటింటికీ వెళ్ళి చెబుతాం."
అన్న మాటలకు తోడుగా లత కూడా తలూపింది. ఆ రోజు నుండి ఇద్దరూ కలిసి ఊరంతా తిరిగారు. ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని అందరికీ వివరించారు. "పాఠశాలలో పుస్తకాలు, నోటుబుక్కులు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం ... ఇవన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నది. వీటిని తీసుకోకపోతే దుర్వినియోగం చేసినట్లే" అని అర్థమయ్యేలా చెప్పారు.
ఇంతటితో ఆగలేదు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలతో గణితం, ఇంగ్లీషు, భౌతికశాస్త్రం వంటి సబ్జెక్టులలో పోటీపడ్డారు. వీరే నెగ్గారు. అది చూసిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల పట్ల గౌరవం కలిగింది. చాలా మంది చేరాలని ముందుకు వచ్చారు.
అన్నాచెల్లెళ్ళ కృషి ఫలించింది. కేవలం ఇరవై మంది ఉన్న పాఠశాలలో నలభై మంది విద్యార్థులు చేరారు. వారి తెలివితేటలకు, పట్టుదలకు మెచ్చిన సర్పంచ్ మరియు ఉపాధ్యాయులు ఇద్దరినీ సన్మానించి బహుమతులు ఇచ్చారు. తల్లిదండ్రులు రంగయ్య, రమలు పొంగిపోయారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు లత అందరి ముందు ఉపన్యసించింది. "మా అమ్మానాన్న, అన్న నాకు మంచి బుద్ధులు నేర్పారు. ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందించారు. ఈ రెండూ కలిస్తేనే మనిషి జీవితంలో ఉన్నతంగా నిలబడగలడు. అందుకే ప్రతి బిడ్డా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి" అని చెప్పింది. ఆమె మాటలు చాలా మందిని కదిలించాయి.
కాలం గడిచింది. కష్టపడి చదివిన నిఖిల్ డాక్టరయ్యాడు. లత పోలీసు అధికారిణి అయింది. ఇద్దరూ తమ వృత్తిలో నిజాయితీగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడసాగారు. వృద్ధులైన రంగయ్య, రమలు ఇక పొలానికి వెళ్ళకుండా చూసుకున్నారు. అన్ని సౌకర్యాలూ కల్పించి తల్లిదండ్రులను సంతోషపెట్టారు.
ఆ పాఠశాల అభివృద్ధి కావడానికి నిరంతరం పాటుపడ్డారు.
ఇరవై ఏళ్ల తర్వాత అదే పాఠశాలకు అతిధులుగా వచ్చారు. ఆ పాఠశాలను మరింత అభివృద్ధి పరుస్తూనే ఉన్నారు.
ఇబ్రహీంనగర్‌లో ఎవరైనా ఆదర్శప్రాయులైన వారి పేర్లు చెప్పాలంటే నిఖిల్ మరియు లత పేర్లే ముందు వినబడతాయి.
ఎందుకంటే వారి అంకితభావం అందరికీ ఆదర్శప్రాయం అయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి