చివరికి గెలిచేది మన మంచితనం : - మిత్రాజి -( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )-ఫోన్ నం. 9949267638
కాలమనే వేటగాడు ఎప్పుడు గాలం వేస్తాడో, 
ఎవరిని పట్టుకుంటాడో, ఏ రూపంలో వస్తాడో
 ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి క్షణం
 అప్రమత్తంగా, ప్రతి కష్టసుఖాలకూ సిద్ధంగా ఉండాలి. 

ఈ భూమిపై జన్మ ఎత్తామంటేనే 
ఒక ప్రతిజ్ఞతో వచ్చాము - సుఖమొచ్చినా 
నవ్వుతూ, కష్టమొచ్చినా వెన్ను చూపకుండా 
ఎదుర్కొంటామని. జన్మలెన్నైనా, జీవితాలెన్నైనా 
మనిషిగా పుట్టి మనిషిగా బతకడమే మన అసలైన ధర్మం. 

లోకం వేసే నిందలు, మోపే తప్పులు, 
రాసే పాపాలు మనపై పడినా సరే అని సహించే 
శక్తి కావాలి. మన మనసు స్వచ్ఛంగా, 
నడత నిజాయితీగా ఉంటే చాలు.

చెడు జరగకూడదంటే బుద్ధి తెలిసిన నాటి నుండే 
మంచి విత్తనాలు నాటాలి, చేతనైనంత సాయం చేయాలి,
 నోటితో దైవాన్ని స్మరిస్తూ చేతలతో ధర్మాన్ని నిలబెట్టాలి. 

కాలం అందరినీ సమానంగా పరీక్షిస్తుంది.
 ఒకవైపు వినాశనం ఉంటే మరోవైపు వెలుగు ఉంటుంది, 
ఒకవైపు కన్నీళ్లు ఉంటే మరోవైపు చిరునవ్వులు ఉంటాయి. 

కష్టం వచ్చినప్పుడు "నేనెందుకు?" అని ప్రశ్నించకు,
 సుఖం వచ్చినప్పుడు "నేను గొప్ప" అని విర్రవీగకు
. ప్రతి ఎదురుదెబ్బ నిన్ను బలంగా తయారు చేస్తుంది.

ప్రతి గాయం నీకు గుణపాఠం నేర్పుతుంది. 
నీ జీవితపు నదిలో పడవ నీదే, తెడ్డు నీ చేతిలోనే ఉంది. 
ధైర్యంగా తెడ్డు వేస్తూ ముందుకు సాగు. మంచి చేస్తూనే ఉండు, 
ఎందుకంటే చివరికి గెలిచేది మన మంచితనమే


కామెంట్‌లు