బృందావనానికి వచ్చిన తొలిరోజుల్లోనే కృష్ణుడికి ఒకే ఒక విషయం అంటే చాలా ఇష్టం.
అది యమున.
ప్రతి రోజూ, తన దూడలను మేపిన తర్వాత, కృష్ణుడు తన మిత్రులతో కలిసి యమునా నది ఒడ్డుకు వచ్చేవాడు.
అతను ఒడ్డు వెంబడి ఇసుక మీద పరుగెత్తేవాడు.
నీటిలోకి రాళ్లు విసిరేవాడు.
అలలు వచ్చి తన పాదాలను తడిపినప్పుడు నవ్వేవాడు.
అదే సమయంలో, కృష్ణుడు యమునను ఆస్వాదిస్తుంటే, యమున కూడా అతన్ని చూసి ఆస్వాదించేది
ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్న ఆమె....ఇప్పుడు అతని కళ్లెదుట ప్రత్యక్షమైంది....
ఒకరోజు, ఎప్పటిలాగే, కృష్ణుడు కోపంగా ఉన్న తన మిత్రులతో యమునా నది ఒడ్డుకు వచ్చాడు.
దూరం నుండి అతన్ని చూసిన యమున, ఒక్కసారిగా పైకి ఎగిరింది.
ఆమె అలలు అకస్మాత్తుగా వేగంగా ప్రవహించడం ప్రారంభించాయి.
నెమ్మదిగా ఒడ్డును తాకుతున్న నీరు, ఇప్పుడు మున్ముందుకు సాగడం ప్రారంభించింది.
దాంతో మిత్రులందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
“కన్నయ్యా... నీళ్ళు పెరుగుతు న్నాయి...రా వెనక్కు వెళ్ళిపోదాం" అన్నారు మిత్రులు.
కానీ కృష్ణుడు నవ్వాడు.
అతను నిశ్శబ్దంగా యమున వైపు చూశాడు....అలలు దగ్గరకు వచ్చాయి.
అవి ఒడ్డును తాకాయి....అవి మళ్ళీ వెనక్కి వెళ్ళాయి....అవి తిరిగి వచ్చాయి....అవి మళ్ళీ వెనక్కి వెళ్ళాయి.....
మిత్రులకు ఏమీ అర్థం కాలేదు.
“ఈరోజు యమునకు ఏమైంది?” అని అవి ఒకరికొకరు అనుకున్నారు
కృష్ణుడు ఒక్కడే ఒడ్డు వెంబడి నెమ్మదిగా నడుస్తున్నాడు.
యమున కొంచెం ముందుకు వచ్చింది.
ఒక చిన్న అల మాత్రమే అతని పాదాల వైపు పరుగెత్తుకొచ్చింది... అది అతన్ని మెల్లగా తాకింది.
అంతే....ఎన్నో యుగాలుగా యమున ఎదురుచూస్తున్న కోరిక ఆ ఒక్క క్షణంలో నెరవేరింది....ఆ అల నెమ్మదిగా వెనక్కి వెళ్ళింది.
అప్పుడు, ఎక్కడినుంచో యమున అలలతో కొన్ని తామర పువ్వులను తోసుకుంటూ వచ్చి అతని పాదాల వద్ద ఉంచింది.
అప్పటి వరకు ఆందోళనగా ఉన్న మిత్రులు ఆశ్చర్యంగా చూసారు.
“కృష్ణా... యమున నీకు పువ్వులు ఇస్తోంది!” అని చప్పట్లు కొట్టారు.
నవ్వుతున్నది ఒక్క కృష్ణుడు మాత్రమే.....కానీ యమున కోరిక అంతటితో ఆగలేదు..... ఆమె కృష్ణుడి పాదాలను తాకింది....ఇప్పుడు ఆమెకు కృష్ణుడు ముద్దు కూడా కావాలి.
ఆమె కోరిక కృష్ణుడికి తెలియదా?
ఆ క్షణంలో, దగ్గరలో ఉన్న కొన్ని దూడలు దాహంతో యమున నీటిని తాగడం మొదలుపెట్టాయి.
అవి నేరుగా నీటిలో నోరు పెట్టి తాగడాన్ని కృష్ణుడు చూశాడు.
అకస్మాత్తుగా, అతని కళ్ళలో కొంటెతనం మెరిసింది.
“అన్నయ్యా... నేను కూడా దూడల్లాగే నీరు తాగి దాహం తీర్చుకుంటాను ...” అని అన్నాడు కృష్ణుడు బలరాముడితో.
బలరాముడు ఏదో చెప్పేలోపే, కృష్ణుడు మోకాళ్ళపై కూర్చున్నాడు. అతను తన రెండు చేతులను వెనుకకు జోడించాడు.
తరువాత అతను దూడలా వంగి యమునా నది నీటిని తాగడం ప్రారంభించాడు. అది చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు.
"కృష్ణుడు కూడా దూడ అయిపోయాడు!" అని చప్పట్లు కొట్టారు.
కృష్ణుడు మాత్రం చాలా ఉత్సాహంగా నీటిని తాగుతున్నాడు.
యమున కూడా ఆనందంలో మునిగిపోయింది.
దేవతల పాదాలు ఆమెను తాకాయి.
ఇప్పుడు దేవతల నోరు కూడా కనిపించింది.
ఆమె అలలు మెల్లగా ఒడ్డును తాకి నాట్యం చేశాయి.
కృష్ణుడు నీటిలో నుండి పైకి లేచినప్పుడు, అతని పెదవులకు అంటుకున్న నీటి చుక్కలను చూసి యమున మరింత ఆనందపడింది.
బలరాముడు చిరునవ్వుతో అడిగాడు "కృష్ణా... నువ్వు దూడవా? లేక అల్లరి పిల్లాడివా?"
కృష్ణుడు ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ, “ దాహం వేస్తే, అందరం ఒక్కటే...” అన్నాడు.
ఆ రోజు బృందావనంలో కృష్ణుడి దూడలు మాత్రమే నీళ్లు తాగలేదు.
యమున కూడా తన యుగాల దాహాన్ని తీర్చుకుంది కృష్ణుడి తీర్చుకున్న దాహంతో.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి