నీడతో క్రీడ: - - యామిజాల జగదీశ్


 సాయంత్రాలలో తోటలో లేదా ప్రవేశద్వారం వచ్చ ఆడుకోవడం అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం.
ఆ రోజు అతను వాకిట్లో పరుగెత్తుతూ ఆడుకుంటున్నాడు.
సూర్యుడు అస్తమిస్తున్నాడు.
అతను పరుగెడుతుండగా, అతని వెనుక మరో కృష్ణుడు పరుగెడుతు న్నాడు.
మొదట అతను దానిని గమనించలేదు.
అకస్మాత్తుగా నేల మీద ఏదో నల్లనిది కదలడం చూశాడు. అంతే ఆ క్షణమే అతను ఆగాడు. అది కూడా ఆగింది.
అతను తన చెయ్యి పైకి ఎత్తాడు.
అది కూడా తన చెయ్యి పైకి ఎత్తింది.
కృష్ణుడు నవ్వాడు.
అతను తన మరో చెయ్యి ఊపాడు.
అది కూడా ఊపింది.
ఇప్పుడు కృష్ణుడికి ఆశ్చర్యం కలిగింది.
దాన్ని పట్టుకోవాలని అనుకుని, దాని మీదకు దూకాడు. కానీ అది దొరికితేగా.
కృష్ణుడు పరుగెడుతుండగా, అది కూడా పరుగెత్తింది.
కృష్ణుడు ఆగినప్పుడు, అది కూడా ఆగింది.
కొన్నిసార్లు అతను తన నీడతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
కొన్నిసార్లు దాని మీద చెయ్యి పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అతను కిందకు వంగి నేలను తాకాడు.
తర్వాత నేలను తట్టాడు.
అదంతా చూసి బలరాముడు చప్పట్లు కొట్టి నవ్వాడు.
కృష్ణుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో, తన నీడ అంతకంతకూ పెద్దదవుతుండటం చూసి భయపడి, పరిగెత్తి యశోద వెనుక దాక్కున్నాడు.
ఆమె నవ్వి అతన్ని పైకి ఎత్తుకుంది.
“అది నీ నీడా, కన్నా…” అని నందుడు అంటూనే ఉన్నాడు.
కానీ కృష్ణుడికి అర్థం కాలేదు.
అతను మళ్ళీ కిందకు దిగి దానితో ఆడుకోవడానికి పరిగెత్తాడు.
దూరం నుండి యశోద, నందుడు ఆ పిల్లవాడి ఆటను చూసి నవ్వుతూ ఆనందించారు.
ఆ రోజు అక్కడ ఇద్దరు కన్నయ్యలు ఆడుకుంటున్నారు.
ఒకడు నీలంగా ఉన్నాడు. మరొకడు నీడ.
కామెంట్‌లు