కృషితో నాస్తి దుర్భిక్షం: -సి.హెచ్.ప్రతాప్
 రామపురమనే చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతడు చదువులో చురుకైనవాడు, కానీ పేదరికం అతడి ఆశయాలకు అడ్డుగోడలా నిలిచింది. ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్ కావాలనేది రాము ఆశయం. తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ రామును పట్టణంలో చదువుకోవడానికి పంపాడు. పట్టణ వాతావరణం, అక్కడి ఆకర్షణలు చూసి రాము తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయాడు. సమయాన్ని వృధా చేస్తూ, స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేయసాగాడు. పరీక్షల సమయం దగ్గరపడుతున్నా అతడిలో ఎటువంటి బాధ్యత కనిపించలేదు. ఫలితాలు వచ్చినప్పుడు రాము ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఆ వార్త విన్న తండ్రి కుంగిపోయాడు. గ్రామానికి తిరిగి వచ్చిన రాముకు తండ్రి పడుతున్న కష్టం, ఊరి జనం చూపే చులకన భావం తీవ్ర మనోవేదనను కలిగించాయి. ఒకనాడు ఊరి చివర ఉన్న పాత గ్రంథాలయంలో కూర్చుని ఉండగా, స్వామి వివేకానంద జీవిత చరిత్ర అతడి కంటబడింది. అందులో "లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అనే వాక్యం అతడి హృదయాన్ని బలంగా తాకింది.
 
అప్పుడే రాము తన తప్పును తెలుసుకున్నాడు. తనలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండే తన గదిని ఒక తపస్సు కేంద్రంలా మార్చుకున్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచి చదువుకోవడం ప్రారంభించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, శరీరం అలసిపోయినా వివేకానందుడి మాటలే అతడికి ఊపిరి పోశాయి. గ్రామంలో కొందరు అతడిని ఎగతాళి చేసినా, అవన్నీ తన ఎదుగుదలకే మెట్లుగా మార్చుకున్నాడు. నిరంతరం శ్రమిస్తూ, ప్రతి నిమిషాన్ని విజ్ఞాన సముపార్జనకు వెచ్చించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తన లక్ష్యం ఎంత కష్టతరమైనదో అతడికి తెలుసు, కానీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగాడు. విశ్రాంతి అనే పదాన్ని తన నిఘంటువు నుండి తొలగించాడు. కేవలం గమ్యం మాత్రమే అతడి కళ్ళ ముందు కదలాడేది. ఎట్టకేలకు ఫలితాలు వచ్చాయి. రాము దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
గ్రామమంతా సంబరాల్లో మునిగిపోయింది. అతడిని తక్కువ చేసి చూసిన వారే నేడు ప్రశంసల వర్షం కురిపించారు. వివేకానందుడి సిద్ధాంతం ఒక సాధారణ యువకుడిని ఎలా ఉన్నత శిఖరాలకు చేర్చిందో అందరికీ అర్థమైంది. ఒక సన్మాన సభలో రాము తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగంతో ప్రసంగించాడు.
"మిత్రులారా, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సహజం, కానీ అక్కడే ఆగిపోవడం వివేకం అనిపించుకోదు. నా జీవితంలో చీకటి కమ్ముకున్న వేళ స్వామి వివేకానంద బోధనలు నాలో కొత్త వెలుగును నింపాయి. మనలో అనంతమైన శక్తి ఉంది, దానిని గుర్తించడమే అసలైన మేల్కొలుపు. నిద్రపోయేవాడు కేవలం కలలు కంటాడు, కానీ మేల్కొన్నవాడు ఆ కలలను నిజం చేసుకుంటాడు. అడ్డంకులు అనేవి మనల్ని ఆపడానికి కావు, మన శక్తిని పరీక్షించడానికి వస్తాయి. నేను నిద్రమత్తును వీడి, సోమరితనాన్ని వదిలిపెట్టి కేవలం గమ్యం వైపు మాత్రమే అడుగులు వేశాను. మన ప్రయాణంలో అలసట సహజం, కానీ గమ్యం చేరే వరకు విశ్రమించకూడదని నేను గట్టిగా నమ్మాను. ఆ సంకల్పమే ఈనాడు నన్ను మీ ముందు నిలబెట్టింది. ప్రతి యువకుడు తనలోని శక్తిని నమ్మి, లక్ష్యసాధన కోసం నిరంతరం పోరాడాలి" అని రాము అన్నాడు.

కామెంట్‌లు