ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: --ఈర్ల సమ్మయ్య
 --ఊషన్నపల్లి స్కూల్లో ఘనంగా చిన్నారి మేడి శాన్విత జన్మదిన వేడుకలు


 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటున్నాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 4వ తరగతి చిన్నారి మేడి శాన్విత పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తన స్నేహితుల మధ్య చిన్నారి శాన్విత ఆనందోత్సాహాలతో పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ,  ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి సరితలు చిరంజీవి శాన్వితను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, విద్యాబుద్ధులతో
 విలసిల్లాలని వారు ఆమెను దీవించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈర్లసమ్మయ్య మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ   శాఖలు, ఇతర రంగాల్లో కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న వారందరూ 98 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని ఆయన గుర్తు చేశారు. ఇందుకు కారణం ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార, శాస్త్రీయమైన, నాణ్యమైన విద్యను అందించడమేనన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపతాయని, అప్పుడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సిండికేట్ అయి ఇష్టారాజ్యంగా లక్షల్లో  ఫీజులు వసూలు చేసి, పిల్లల తల్లిదండ్రులను దోచుకునే సంస్కృతి అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థ అనేది ఒక వ్యాపార వ్యవస్థ అని, ప్రైవేట్ విద్యా వ్యవస్థ అనేది భవిష్యత్తు తరాలకు అంత మంచిది కాదని, అది ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు ఆదరించాలని, వాటిని కాపాడాలని, ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే కొన్ని తరాలపాటు ఆయా గ్రామాల ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఈర్ల సమ్మయ్య హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో పాటు పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు