దూడలను మేపడానికి ఎప్పటిలాగే ఉదయాన్నే బృందావనానికి వెళ్లాడు కృష్ణుడు. ఆ రోజు మధ్యాహ్నం కొంచెం వర్షం పడింది. అందువల్ల దారంతా తడితడిగా ఉంది. కృష్ణుడు పరిగెడుతూ, గెంతుతూ వస్తున్నాడు.
అప్పుడు హఠాత్తుగా నేలను చూశాడు. మట్టిలో ఒక చిన్న అడుగుజాడ కనిపించింది. అది అతని అడుగుజాడే.
కానీ అది కృష్ణుడికి తెలియలేదు. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ అడుగుజాడ కూడా ఒక అడుగు పెరిగింది. కృష్ణుడు నిలబడ్డాడు. అడుగుజాడ కూడా నిలిచింది. కృష్ణుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు.
“అన్నయ్యా...” అంటూ బలరాముడిని పిలిచాడు.
“ఏంటి కృష్ణా?”
“ఇక్కడ ఎవరో నా వెనుకాలే వస్తున్నారు...” అన్నాడు కృష్ణుడు.
బలరాముడు కిందకు చూశాడు. వెంటనే నవ్వు వచ్చేసింది.
“అది నువ్వే కృష్ణా...” అన్నాడు బలరాముడు.
కృష్ణుడు నమ్మలేదు. కింద కూర్చుని తన కాళ్లను పైకెత్తి చూశాడు.
తర్వాత మట్టిలో ఉన్న అడుగుజాడలను చూశాడు. మళ్లీ తన కాళ్లను చూసుకున్నాడు.
“లేదు అన్నయ్యా... అది నా అడుగుజాడ కాదు...” అన్నాడు.
“ఎందుకలా అంటున్నావు కృష్ణా?” అని బలరాముడు అడిగాడు.
కృష్ణుడు మట్టిలో నమోదైన అడుగుజాడలను చూపించాడు.
"అదిగో చూడు... అందులో తామరపువ్వు ఉంది... తీగ ఉంది... ఇంకా ఏవేవో రేఖలు ఉన్నాయి...”
“నా కాళ్ళల్లో అవన్నీ లేవు కదా. అందుకే అది నా అడుగుజాడ కాదు...” అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వాడు.
“కృష్ణా.. ఆ రేఖలన్నీ నీ కాళ్లలోనే ఉన్నాయి. నీకే తెలియడం లేదు.” అన్నాడు బలరాముడు.
“మరి అవన్నీ మట్టిలో ఎలా కనిపిస్తున్నాయా అన్నయ్యా?” అని కృష్ణుడు అడిగాడు.
“ఇది తడి మట్టి కదా... నువ్వు నడిచినప్పుడు నీ కాల్లో ఉన్న ధ్వజం, వజ్రం, అంకుశం అన్నీ అందులో ముద్రితమయ్యాయి...” అన్నాడు బలరాముడు.
కృష్ణుడు వెంటనే కిందకు వంగి ఆ అడుగుజాడలను ఇంకా జాగ్రత్తగా చూశాడు. తర్వాత తన పాదాలను చూశాడు. మళ్లీ మట్టిని చూశాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు.
“ఓహో...” అన్నాడు.
కానీ మరుక్షణమే మళ్లీ ముఖం ముడుచుకుంది.
మళ్లీ ఒక అడుగు నడిచాడు. అడుగుజాడ కూడా కదిలింది.
అతను వేగంగా నడిచాడు. అడుగుజాడ కూడా వేగంగా వచ్చింది.
అతను పరిగెత్తాడు. అడుగుజాడ కూడా పరిగెత్తింది.
ఇప్పుడు కృష్ణుడికి కొంచెం భయం వేసింది.
“అన్నయ్యా! వీడు నన్ను అస్సలు వదలడం లేదు!” అన్నాడు.
ఆ మాటలతో గొల్లపిల్లలందరూ నవ్వడం మొదలుపెట్టారు. కృష్ణుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాడు.
హఠాత్తుగా ఒక చెట్టు వెనుకకు పరిగెత్తి దాక్కున్నాడు. కాసేపు ఆగిన తర్వాత మెల్లగా తొంగి చూశాడు. అడుగుజాడ లేదు.
“ఆహా!” అని సంతోషపడ్డాడు.
“నాతో ఇప్పటి వరకూ వచ్చిన ఆ మనిషి వెళ్ళిపోయాడు!” అన్నాడు కృష్ణుడు.
చెట్టు వెనుక నుండి బయటకు వచ్చాడు. రెండు అడుగులు నడిచాడు. మళ్లీ అడుగుజాడ వచ్చేసింది.
“అన్నయ్యా!” అని అరిచాడు. “మళ్లీ వాడెవడో వచ్చేశాడు!”అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వుతూనే ఉన్నాడు.
“కృష్ణా... అది నీ అడుగుజాడే...” అన్నాడు.
“లేదు. నేను ఇక్కడ ఉన్నాను. అది అక్కడ ఉంది.” అని వాదించాడు కృష్ణుడు.
బలరాముడికి అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియలేదు.
దగ్గరలో ఒక చిన్న దూడ నిలబడి ఉంది. బలరాముడు దానిని చూపించాడు.
“అదిగో చూడు.... దూడ నడిచింది. దాని వెనుక అడుగుజాడ పడింది. దూడ నిలబడింది. అడుగుజాడ కూడా నిలిచింది.
కృష్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత తన కాళ్లను చూశాడు. ఆపై నేలను చూశాడు. మళ్లీ ఒక అడుగు వేశాడు. మళ్లీ అడుగుజాడ పడింది.
అప్పుడు అతనికి అర్థమైంది.
“ఓహో.... అంటే వీడు నేనేనా?”
“అవును.”
“ఎప్పుడూ నాతోనే ఉంటాడా?”
“అవును.”
“నేను పరిగెడితే?”
“
“పరిగెడతాడు.”
“
“నేను నిలబడితే?”
“
“నిలబడతాడు.”
కృష్ణుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. తర్వాత అతని ముఖం వికసించింది.
“అలాగైతే నాకు ఒక స్నేహితుడు దొరికాడు!” అన్నాడు.
ఆ తర్వాత రోజంతా తన అడుగుజాడలతోనే మాట్లాడుకుంటూ నడిచాడు.
"నేను వెళ్లే ప్రతి చోటికీ నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి వెళ్లినా రావాలి, సరేనా? ఎవరైనా నీతో ఏదైనా చెబితే, అది వచ్చి నాతో చెప్పాలి. సరేనా” అని చెప్పుకుంటూ నడిచాడు.
కాసేపటి తర్వాత అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది.
ప్రతి చోటా చూసి చూసి అడుగులు వేయడం ప్రారంభించాడు.
“ఇదిగో... ఇక్కడ ఒక అడుగు... రాధా...” అని చెప్తూ అడుగు వేశాడు.
“ఇంకా అక్కడ ఒక అడుగు... రాధే...” అని చెప్తూ పరిగెత్తాడు.
“అయ్యో... ఆ చెట్టు కింద ఇంకా పెట్టలేదు కదా... రాధ...” అనుకుంటూ అక్కడ కూడా ఒక అడుగు వేశాడు. ముద్రించాడు.
ఆ తర్వాత అతనికి అది ఒక ఆటగా మారిపోయింది. ప్రతి అడుగు వేసేటప్పుడు, “రాధా...” అని అంటూనే వేశాడు. దూడలు మేసే పచ్చికబయళ్లలో ఒక అడుగు.
యమునా నది ఒడ్డున ఒక అడుగు. పెద్ద మర్రిచెట్టు నీడలో ఒక అడుగు.
పువ్వులు వికసించిన దారిలో ఒక అడుగు. తనకు నచ్చిన ప్రతి చోటా తన చిన్నారి అడుగులను ముద్రించాడు. ఉంచాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు, బృందావనంలో తన అడుగు పడని స్థలమే లేదని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు.
"ఇది కూడా నా స్థలమే... అది కూడా నా స్థలమే...” అని ఆ అల్లరివాడు తన చరణాల ముద్రలను బృందావనమంతటా 'రాధా రాధా' అని అంటూ ముద్రించాడు. ఇలా బృందావనమంతటా కృష్ణుడి అడుగుజాడలే కాకుండా, "రాధ" అనే నామం కూడా వాటితో పాటు వ్యాపించింది.
మీకొక మాట చెప్పనా?
ఆరోజు కృష్ణుడు కేవలం తన అడుగుజాడలను చూడలేదు. ప్రపంచమంతా అనుసరించబోయే తన దివ్య చరణాలను మొదటిసారిగా చూశాడు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి