వాన దేవుడా!: - పద్మ త్రిపురారి.
బిక్కు బిక్కు మని దిక్కులు 
చూసే,రైతన్నల కను కొలకుల్లో 
కన్నీరై నిలిచిపోయావా?

దండిగ మండిన
ఎండల వేడికి
కాయకష్టముతో 
చెమటను చిందిన 
శ్రమజీవుల బిందువు నీవై 
కదలక మెదలక 
నిలువరించావా?

నేల నింగి మధ్యన
సాగే
ఉష్ణపు పొరవై
ఊపిరాడని దాహపు తెరవై 
సతమతమయ్యే మనుషుల
 వెతలకు నే దూరం దూరం
 అంటూ, ఆకాశంలో ఆగావేమిటి?

  వాన దేవుడా?
ఓ వరుణ దేవుడా!
కనికరించవా!
కరుణ చూపవా!
జల జల రాలే
చల్లని చినుకై 
పుడమి తల్లికే
పులకింతల మొలకై 
అన్నదాతకే ఆశల వరమై 
అవని జనులకే
ఆనందపు అలవై 
ఎగసి ఎగసి 
మనసు మురిసేలా 
వరహాల వానవై రావేలా?
ప్రాణి కోటికి జీవదాతవై
అమృత వర్షిణి 
నీవై నీవై నీవై 
నిండు ధారతో ,
మెండుగ దయతో 
రావయ్యా.
ధరణికి సంతస సంద్రము
 నీవే నీవే 
వాన దేవుడా!
వరుణ దేవుడా!
  

కామెంట్‌లు