సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 ఇప్పటి వరకు మీ ఆత్మీయమైన ఆశీస్సులతో 'అ' అక్షరం మీద 150 సామెతలు,'ఆ' మీద 108 సామెతలు పూర్తి చేశాను. ఈ రోజు నుండి 'ఇ' అక్షరం మీద రాస్తున్నాను.ఎప్పటిలాగే మీ ఆదరణ పూర్వక ఆత్మీయతను కోరుకుంటూ 🙏
==========================================================================


సామెత -259: -ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
***
"గదేందవ్వా!ఇంటుంటెనే ఇచ్ఛింత్రంగుంది. గట్లెట్ల జరిగుంటది.గాళ్ళింటికి పక్కింట్లె నుంచి శీమ సుత దూరడానికి బయవడ్తది. గస్మంటి ఇంట్లె గిదెట్లయితది. మనవా గాయింటోళ్ళ ముచ్చెటి గోడవ్తల్నుండే మంచి శెబర రొండు ముక్కలు అన్కునుడే గని ఎన్నడన్న గాళ్ళ దేవిడీల అడ్గు పెట్టినమా? ఎప్పుడు జూశినా 'మూశిన ముత్తేలొతికె' ఉంటరు. కాత్తన్న కల్శిపోతె మనం సుత గంతో గింతో సాయం జేద్దుము."
 "ఏంది శెల్లే? గా ఇచ్ఛింత్రం? ఎవలింట్ల జర్గింది.ఏందా కత నాదన్క రాకనే పాయె."
 "గదే నవ్వా! మనూల్లె దొర్సానమ్మింట్లె దొంగతనం జర్గిందంట. దేవునర్రల దాశిపెట్టిన భోషాణం పెట్టెకి ఏశిన తాళం ఏశినట్టే ఉందంట. గందుల పెద్దొర్సాని ఏడు వారాల నగలు మాయమైనయంట."
"అయ్యో గట్లెట్ల జర్గింది శెల్లే? అయినగని గీ ముచ్చెటి నీకెట్ల ఎరుకైంది? "
 " నువ్వు సుత ఎవ్వలితో అనకు మల్ల మా ఇంటెన్కాల జానమ్మత్త గోడ సాటికి పిల్శి శెప్పింది. గంతే గాదవ్వా! అంజనమేయించడాన్కి పక్కూరి నించి బూతాల బైరయ్యని పిల్శిండ్రంట. గాన్ని సూడంగనే పనోళ్ళు ఎవలి పేరు శెప్తడో పాపిట్టోడని గజ్జున వొణికిండ్రంట గని తప్పు శెప్తే  ముందుగాల దొర గాని శెమ్డాలు ఊడదీత్తడని బయవడి అంజనం పంజేయట్లేదని మెల్లగ తప్పుకుండంట. "
 " గాడ్ని  పిల్పిచ్చిండ్రాను. ఊళ్ళే ఆళ్ళీళ్ల మీద జెప్పి  గాడెంత దురుమారగం జేశిండని."
 " మరెట్ల గా దొంగెవడో తేలిందా శెల్లే? "
" యాడవ్వా! సోది జెప్పే చిల్కమ్మని సుత పిల్పిత్తే "అయ్యా నీ బాంచెన్! కాల్మొక్త !"ఏదో దేవున్ని నమ్ముకొని బత్కుతున్న గింత పెద్ద దొంగతనం ముచ్చెటి నేను జెప్పే ముక్కోటి దేవతలు సుత శెప్పరయ్యా" అన్కుంట బయిట బడ్డదట. "
 " శెల్లే! గియ్యన్ని అడ్గినని ఏవనుకోకు. ఇంగరా గీ యిష్యం నీ కడ్పులనే దాస్కో. నోరు జార్తివా! నీకే దొంగతనం అంటగట్టే రకాలు. మొన్న మా పెద్దోడి బామ్మర్ది వొచ్చినప్పుడు ఓ యిష్యం గానితో గుసగుస్గ శెప్తుంటే యిన్న "మీ ఊరాయిన వొకాయిన వొయిసులో ఉన్నడు. గాయిన బంగారం దుకణంల ఏదో నగలు మార్సంగ సూశిన. గంత మంచిగున్నయి ఎందుకు మారుత్తుండో అన్కున్న. గీయనేదో తేడాగుండు అన్పిచ్చి ఎనకాలెనకాలబడి సాటుగ ఎల్లిన.గా మార్శినవి తీస్కొని మార్వాడి శేటు తానికి బొయ్యి అమ్మంగ సూశిన బావా! " అన్నడు. ఎంటనే  " సూత్తె సూశినవ్ గని ఎవలితో అనబాకని" వొట్టేయించుకుండు మావోడు.గది గిదేనన్న మాట!"
" అవునా అవ్వా! గింత మందిని పిల్పిచ్చి ఏడున్నయో శెప్పమని అడ్గుతున్నరు గని పోలీసోల్లని పిలుత్తల్లే! గక్కడే తేడాగొట్టింది అన్పిచ్చిందవ్వా!"
 "గదే శెల్లే! " ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు" అని గాల్లకి ఎట్ల తెలుత్తది? శెప్పినా నమ్ముతరా? శెప్పినోన్ని పట్కొని నాల్గు ఉత్కుతరు.
" అయిన గని శెల్లే! గాల్లు ఏందింటుర్రో? ఎట్లుంటుర్రో గీ నడ్మ కాలంల ఎవ్వలికి తెల్వదు.గాళ్ళ పెత్తనాలు బోయినంక శానామంది ఊల్లెనే లేకుండ బోయిర్రు. ఒక్కలిద్దరు ఉన్నోళ్ళు ఎన్కటి జమానా లెక్క ఉండుకుంటనే గడ్పదాటట్లేరు.ఇంగ గాల్లిల్లల్ల ఏం జర్గినయి ఎట్ల దెలుత్తయి శెల్లే!"
 "నిజమే అవ్వా! " ఇంటిదొంగను ఈశ్వరుడు సుత పట్టలేడు" అంటే గిదే. అస్లిషయం తెల్సే దన్క గాళ్ళంతట గాళ్ళు బయిట పడేదన్క ఎవ్వలైన సరే కిమ్మన్నాస్తినే.ఇగ పోతవ్వా!"
గదండీ సంగతీ! "ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు" అంటే గిదే మరి. బయిటోడు పట్టినా చెప్పలేడు. గీ నడ్మల కండ్ల ముందు ఘోరాలు జర్గుతున్నయి. సూశినోల్లు సాచ్చం జెప్పమంటె ఎవలన్న ముందుకొత్తుర్రా?గిది సుత గంతే!"
కామెంట్‌లు