కలిసిన చూపులు,మురిసిన మనసులతో విజయ్,లత ఒక్కటయ్యారు.అన్యోన్యత,అవగాహనలతో వారి దాంపత్యం సుఖసంతోషాలతో గడుస్తున్నది.
కాలమెప్పుడూ పరీక్షలకు గురిచేస్తూనే ఉంటుంది కదా!వారి జీవితంలో కూడా పరిస్థితులు తల్లకిందులయ్యాయి.విజయ్ ఉద్యోగం లే ఆఫ్ కు గురికావడంతో ఆందోళన మొదలైంది.లత ఉద్యోగం సాఫీగానే సాగుతున్నా,వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లోకి మారింది.తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే,ఇంటి పనుల్లో ఎక్కువగా ఉండే పరిస్థితి లోకి నెట్టివేయబడ్డాడు.అశాంతి,అసంతృప్తి వారి సంసారజీవితంలో కూడా మనస్పర్ధలకు కారణమైంది.దానికి తోడు ఆర్థిక సర్దుబాట్లు చేసుకోలేక వాదనలు మొదలయ్యాయి.విజయ్ లో అభద్రతాభావం,అనుమానం కూడా మొదలై,అపార్థాలు దూరాలు పెంచే పరిస్థితులు ఏర్పడ్డాయి.
తీసుకున్న లోన్లు కట్టే విషయం మరింత ఇబ్బందిని సృష్టించింది.ప్రేమ,అవగాహనలు పక్కకు జరిగి,బంధమే భారమనిపించేంత దిగజారింది. అహం,పట్టుదలలు అడ్డుగోడలు కడుతుంటే,మొండితనం,అసహనం ఆజ్యం పోసాయి.అప్పటి వరకు పట్టించుకోని ఇరు కుటుంబాల వారి ప్రమేయం పెరిగి,అనిశ్చితి,సంఘర్షణలు పెరిగిపోయాయి.సప్తపది నాటి ప్రమాణాలు మరిచి బంధాన్ని భారంగా భావించి,విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక అంశాలే వారి జీవితాలను అతలాకుతలం చేయగా,అవగాహన లేమితో,ముందు చూపులేని పెట్టుబడులతో బంధాన్నే భారమనుకొనే అనేక పరిస్థితులు తోడవగా వారి దాంపత్యప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది.యువత పరిణతితో,అవగాహనతో,మూలసూత్రమైన ప్రేమతోనే ముడిపడాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి