నిదుర నదిలో కలల నావ
ఎదురు చూసే తీరం
చెదిరిపోక మనసు ముంగిట
వెలుగులు నింపే దైవం!
నీలాకాశపు సంద్రంలో
తానాలాడి వెలికి వచ్చి
తెలి కాంతులు పరచి భువికి
వెలుగుల స్నానం చేయించే దైవం!
నీలి మేఘాల సౌధాలు దాటి
పాల మబ్బుల దారిని సాగి
తేలి పోయె వెలుగుబంతిగా
నేలను కాచే ప్రత్యక్ష దైవం!
పసిడి కిరణాలు తాకిన
పుడమి వైభవము చూసి
తలిరాకులు తలయూచి
స్వాగతం పలికే దైవము!
తుళ్లిపడే తీగ తల్లిపై
వెల్లివిరిసిన మల్లెలు చూసి
చుక్కలేమో అనుకుని
మక్కువ మీరగ చూసే దైవం!
తిరిగి తిరిగి పరిమళాలు
సేకరించి నలు చెరగులా
చేరవేయు పిల్ల వాయువుల
సన్నాయిని విని మురిసే దైవం!
కూరిమిగా చెలిమి కోరి
ఓరిమి తో ఎదురుచూచు ప్రతి
చిరునవ్వుల దివ్వెల హారతి
చేకొని ముదమందే దైవం!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి