సామెతల ఊట- సునం:దమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -252-ఆవునిడిచి గాడిద పాలు పిండినట్లు
***
 "ఏందో గాని ఆలకం ఏం ముద్దగ లేదు. వొకటి శెప్తడు వొకటి శేత్తడు.గదేందిరా అంటే ఎహె నీకు తెల్వదులే అంటడు.అంత పెడసరపు యవ్వారం. గానికి తాకిడి తగిల్తే గని సక్కంగ రాడు. ఏందో శిత్రం మడిషి.శెప్తె ఇనడాయె.వొంట బుట్టదాయె. శెప్పి శెప్పి యాష్ట కొత్తోంది. పెద్దోళ్ళు ఊకెనే శెబుతారు? గా మాత్తరం గానెం లేదాయె. ఏం జేయనవ్వా?" గీ సొదంత శెప్పుకోని కాత్త బర్వు దింపుకుందామని నీ తానికి వొచ్చిన. ఇంగ నా వొల్ల కాదవ్వా! అయ్య అయ్యేనాయె కొడుకు కొడుకేనాయె. గాయన కాలం అయిపోయింది. గీడన్న తెల్విగ మస్లు కుంటడన్కుంటే అయ్య జుట్లెనించి ఎల్లిండు.
ఇంగేం జేద్దును. గీ సంసారం యాడ ఆగమైద్దోనని గబ్బిలమొతికె  సూర్ను బట్కొని ఏలాడుతున్నవ్వా!" ముక్కు శీదుకుంట,కండ్లనీళ్ళు కొంగుతో తుడ్సుకుంట ఆపకుంట శెప్తున్న అంకమ్మని ఊకో బెడ్తూ..
"ముందుగాల గీ ఏడేడి శాయిసుక్క తాగు శెల్లె అన్కుంట కోపుల శాయిచ్చి తాను సుత తాక్కుంట"
అగ్గో శెల్లే గాటికయ్యే సర్దుకుంటై గని నువ్వు గిట్ల ఏడిత్తే తీర్తయా!శెప్పు.గిట్ల ఏడ్శి ఆగకుంట యిశారిత్తే లేనిపోని రోగాలొత్తయి. అంత యిన్నగని అస్లిష్యం ఏందో మల్ల జెప్పు. గాడసలే కొస తీవురం మడిషని యిన్న నిజమేనా శెల్లే?"
 "గదేనవ్వా నా రందంత .మంచి శెబితే యినే ముచ్చటే లేదు.గట్లని ఆడేమన్న మంచి శేత్తడా గదీ లేదు.బుద్ది తీరు బోతడు. పతి దానికి బుస్సు మని ఎగుర్డే. గాన్ని సూత్తుంటే ఒకోపాలైతే మా శికాకు బుడ్తదవ్వా! "
 "మా పెద్దయ్య ఆవసుమంటి మడిషి. ఎంత సాదుగనో ఉంటడు. గీనికి ఎన్నో త్యేపల పైసలాపతిల,శేతలాపతిల,మాటలాపతిల ఆదుకుండు. గస్మంటోడు మొన్నొచ్చినపుడు మాట మీద మాటొచ్చి మంచి శెబర శెప్పబోతె  గయ్యిమని లేశిండు.నేనెంత ఆపుతున్న పోరడు ఆగడే.పాపం పెద్దయ్య గాడిది గుర్రం సమానమెందుకు కావల్నని నవ్వుకుంట నీ ఇట్టమని ఊకుండు."
అవునా శెల్లే! గీ కాలం పొల్లగాండ్లకి శిన్నంతరం పెద్దంతరం,మంచి- మరియాద లేదు. ఎవల్తో ఎట్లుండాల్నో తెల్వకపోతె ఎట్ల?"
నిన్న పొద్దూకి ఎవలో పెద్ద మడిషిని శానా శానా మంచోడని శెప్పి తోల్కొచ్చిండు. గాయిన మావోని లెక్కనే కొసతీవురం మడిషని ఆటెంక అర్తమైంది.మాటల్ల మాటల్ల ఏవో తేడాలొచ్చి  గాయిన గట్టిగ వొర్రుడు.గీడు శేతులు బట్కొని బతిలాడుడు‌. నేనైతె అవ్వా! మావోడికి మాగైందని సంకలు గుద్దుకున్న లేకపోతే ఏంది? ఆవసుమంటి మడిషిని అన్రాని మాటలంటడా? గీయన్నేమో శేతులు బట్కొని బతిలాడుడా?"
 "గంతే శెల్లే మంచోళ్ళకి సోటు లేదు గీ పెపంచకంల. "ఆవునిడిశి గాడిద పాలు పిండినట్లుంది" అంటే గిదే. ఆవసుమంటి మంచోడి సలాలు తీస్కోక గాడిదస్మంటోడి కాడికి పోతే పెక్కున తన్నినట్టయ్యింది. ఇంగ శిన్న శిన్నగ గానికే బుద్దొత్తది తీ రాకుంటే గాని కర్మ. నువ్వేం బుగులు పడకు శెల్లే. ''
"గదండీ సంగతి!  "ఆవునిడిచి గాడిద పాలు పిండినట్లు" అంటే మంచినొదిలి శెడెంట బోయినట్లన్న మాట.

కామెంట్‌లు