శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - 132
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
110. కుణ్డలినీ (చతురక్షరీ)
111. బిసతంతుతనీయసీ (అష్టాక్షరీ)
నూట పదకొండవ నామ మంత్రము:
ఓం బిసతంతుతనీయస్యై నమః
బిసతంతు  = తామరతూడు లోని దారము; తనీయసీ = మిక్కిలి సన్ననైన, సూక్ష్మ రూపము కలది.
కొత్త వరిధాన్యపు కంకు యొక్క ముల్లు లాగా కృశించిన, స్వచ్ఛమైన, అణువుతో సమానమైన రూపములో, తామరతూడంత సన్నగా దర్శనమిచ్చిన అమ్మవారిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "బిసతంతుతనీయసీ" అని కీర్తించి తరించారు. వరిధ్న్యపు కంకు లాగా స్వచ్ఛంగా మనల్ని అనుగ్రహిస్తున్న పరాత్పరికి నమస్కారము.
"నీవారసూకవత్తన్వి పీతా భాస్వ తృణూపమా" అని "శృతి" వాక్యము. పైన చెప్పుకున్నట్టు గా, వరికంకు యొక్క సన్నని కృశించి, సూక్ష్మాతి సూక్ష్మమైనదిగా ఉంటూ, చుట్ట చుట్టుకొని, తన తోకను నోటితో పట్టుకుని మూలాధారము లో నిద్రాణంగా ఉంటుంది కుండలినీ శక్తి.
సాధకుడు తన గుదమును కొద్దిగా ముందుకు వంచి, వాయువును ప్రయత్నపూర్వకంగా పైకి పంపాలి. అప్పుడు అలా పైకి వచ్చిన వాయువు తగలడం వలన, అగ్ని తత్వము ప్రేరేపితము అవుతుంది. ఈ విధంగా ఏర్పడిన వేడి వల్ల సర్పము రూపంలో ఉన్న కుండలినీ శక్తి మేల్కొని, ఆరు చక్రములు, మూడు గ్రంధులనూ భేదించుకుని సహస్రార పద్మము లో మధ్యలో వున్న త్రికణంలో వున్న శంభుని చేరుతుంది, కుండలినీ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరి. అప్పుడు కురిసే అమృత ధారల వర్షాన్ని డెబ్బై రెండు వేల నాడులలో నింపి, సాధకుడు తృప్తాత్ముడను అయ్యాను అనుకుంటాడు.
మూలాధార చక్రము లో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని సాధకుడు జాగృతం చేయాలి. ఈ విధంగా కుండలినీ శక్తి జాగృతం చేయబడుతుంది కనుక,  ఈ స్థితిని "ఉత్పత్తి" అవస్థ అంటారు. దీనినే "కౌమార వయస్సు" అని కూడా అంటారు. తన ప్రయాణం ఊర్ధ్వ దిశగా మొదలు పెట్టిన కుండలినీ శక్తి, విశుద్ధ, అనాహత చక్రాల మధ్యన సూర్యుని ప్రభావం వలన యౌవనవంతురాలు అవుతుంది. సూర్యకిరణాల తాకిడికి చరాచర జగత్తులో ని జీవరాసులు అన్నీ జీవంతో ఉత్తేజాన్ని పొందుతారు కదా, అలాగే కుండలినీ శక్తి కూడా యౌవ్వనం లోకి వస్తుంది. దీనినే "తారుణ్య అవస్థ" అని కూడా అంటారు. ఇక్కడ నుండి సహస్రారము చేరి పరమేశ్వరునితో కలసి, "పతివ్రత" అవుతుంది, పరమేశ్వరి.

"నీవారసూకవత్తన్వి పీతా భాస్వ తృణూపమా" అని తనను కృశించిన, సూష్మశరీరాత్మికగా తలచి, ఏ సాధకుడు తన సాధనా మార్గంలో ముందుకు వేళుతూ తన వద్దకు చేరాలని నిరంతర సాధన చేస్తాడో, అటువంటి తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం బిసతంతుతనీయస్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు