వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
111. బిసతంతుతనీయసీ (అష్టాక్షరీ)
112. భవానీ (త్ర్యక్షరీ)
నూట పన్నెండవ నామ మంత్రము:
ఓం భవాన్యై నమః
భవ = మహాదేవుడు / సంసారము / మన్మధుడు, భవానీ = భవుని యొక్క పత్ని.
"భవ" అని పిలువబడే మహాదేవుడు "జల" రూపంలో ఉంటాడు. అంబ ప్రార్థన విని మన్మధుని జీవింపచేసాడు. ఆవిధంగా అమ్మ మన్మధునికి ప్రాణం పోసినదిగా, మహాదేవుని కలిసి మహాదేవి గా, సంసారమను ఈ ప్రపంచమును జీవింపచెసేదిగా కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "భవానీ" అని కీర్తించారు. ఈ చరాచర జగత్తుకు జీవం ఇచ్చే అమ్మకు నమస్కారము.
పరమేశ్వరునికి ఉన్న ఎనిమిది రూపాలలో, రెండవ రూపము "జలమూర్తి". భవుడు అని పిలువబడే ఈ జలమూర్తి కి "ఉష" అనే భార్య, "శుక్రుడు" అనే కుమారుడు ఉన్నారు. ఈ భవుని వల్లనే భూతములు పుట్టుతున్నాయి. ఈ భూతముల వలన ఉదకము/నీరు/భావనలు కలుగుతున్నాయి. అందువల్లనే ఈ జలమూర్తిని "భవుడు" అన్నారు. భవుని కూడిన శ్రీమాత "భవానీ" అని పిలువబడింది.
ఈ భవానీ, ప్రాణులకు జీవాధారమైన జలాన్ని తీసుకుని వస్తున్నది. "స్థానేశ్వర పీఠాని" కి ఈ భవానీ అధిష్టాన దేవత. ఈమే చరాచర జగత్తులో జీవులకు ప్రాణం పోసి బ్రతికిస్తుంది. కనుక "శంకరులు" భవానీ అని కీర్తించారు.
తల్లికి, సాధకుడైన తన భక్తుని పైన అవ్యాజమైన కరుణ, దయ, ప్రేమ ఉంటాయి. సాధనా మార్గంలో ఉన్న సాధకుడు గొంతెత్తి, నోరారా "భవానీ" అని అమ్మని పిలిచి, కొలిచి, తన కోరిక తెలియచేయాలి అనుకుంటాడు. కానీ, అమ్మ మనసు ఎంత కరుణా పూరితం అంటే, పూర్తిగా"భవానీ " అని పలకాలని మొదలు పెట్టి, "భ" అనే అక్షరాన్ని పలకగానే తన సాధకుని ఆత్రాన్ని, అంతరంగాన్ని తెలిసిన శ్రీమాత, పన్చబ్రహ్మ సింహాసనం పైన కూర్చుని, ముక్కోటి దేవతలు శిరములు తన పాదములపై ఉంచి, ప్రార్ధన చేసే తన పాదపద్మముల సేవా భాగ్యం కలిగిస్తుంది.
భవతి భవతేవా సర్వమితి భవః అనగా, అంతా తానే అయినవాడు, అన్నింటా తానై ఉన్నవాడు అయినవాడు, భవుడు . భవుని భార్య "భవానీ". సంసార సాగరాన్ని దాటించేది, శుభములను ఇచ్చేది, భవసాగరాన్ని దాటించి మొక్ష ప్రసాదాన్ని ఇచ్చే తన సాయుజ్యాన్ని ఇచ్చి, తనను "భవానీ" గా కొలిచే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం భవాన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి