వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
112. భవానీ (త్ర్యక్షరీ)
113. భావనాగమ్యా (పన్చాక్షరీ)
నూట పదమూడవ నామ మంత్రము:
ఓం భావనాగమ్యాయై నమః
భావనా = భావనచేత / సాధనచేత / ఉపసనచేత, ఆగమ్య = పొందదగినది; అగమ్య = పొందలేనిది.
ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అమ్మను పొందడానికి తగిన సాధనామార్గాలను చెపుతున్నారు. కేవలం మంత్రం చెప్పేసి, ఏవేవో క్రియలు ఆ మంత్రానికి తగినట్లుగా చేసేస్తే, అమ్మ సాక్షాత్కారము పొందలేము. మంత్రం చెప్పడమూ, క్రియ చేయడము మాత్రమే సరిపోదు. సద్గురువు ముఖతః నేర్చుకున్న మంత్రాన్ని, మనసా, వాచా నమ్మి త్రికరణశుద్ధిగా సాధన చేసే సాధకుల మదిలో కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "భావనాగమ్యా" అని కీర్తించారు. అలా మంత్ర భావనను మననం చేయడం వలన కనిపించి, అనుగ్రహించే లోకమాతకు నమస్కారము.
"భావానా" పద్ధతులు మూడు విధాలు. బ్రాహ్మీభావన, మాహేశ్వరభావన, అక్షరభావన. అలాగే, అవ్యక్తరూప భావనా, వ్యక్తరూప భావనా, సగుణస్వరూప భావనా అని కూడా మూడు రూపాలుగా చెప్తారు. ఈ మూడు భావనా మార్గాలలో సాధన చేసిన సాధకులు అమ్మ యొక్క ఆత్మ తత్వమును పొంది, తాదాత్మ్యతాభావాన్ని అనుభవిచ కలుగుతారు.
అమ్మ యొక్క ఏ నామమైనా సద్గురువు నేర్పిన పద్ధతిలో చెప్పేస్తే మన గమ్యం మనం చేరలేము. "భావన" అంటే, మన మనసులో స్థిరత్వాన్ని ఏర్పరచుకుని, శ్రీమాత యందే మనసును నిశ్చలంగా లగ్నం చేసి, ఆ మంత్రం లో శ్రీమహారాజ్ఞి యొక్క సగుణ రూపాన్ని సాక్షాత్కరింప చెసుకోవాలి. "శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా" అనే పదహారు అక్షరముల అమ్మ నామాన్ని పలికినప్పుడు, ఈ నామంలోని అర్ధాన్ని తెలుసుకుని, అమ్మ సూక్ష్మ రూపాన్ని ఊహలలో తెచ్చుకుని, మనసులో నిలుపుకోవాలి. ఈ విధంగా, భావానా మాత్రంగా దర్శనం ఇస్తుంది కనుక, శ్రీమాత "భావనా గమ్య" అయ్యింది.
ఈ విధంగా, ఏ సాధకులైతే తన యొక్క నామ మంత్రాలను అర్థం చేసుకుని, ఊహలలో ఆమంత్రంలో తన రూపాన్ని నిర్మించుకుని సాధన చేసి, తనను చేరాలి అనుకునే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం భావనాగమ్యాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి