సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం.
 సామెత-300: ఇగురం తప్పినమ్మ ఇంటెనుక జూడు-ఓగెం తప్పినమ్మ  వంటిల్లు జూడు

 

***
"కొందరేందవ్వా గట్లుంటరు? ఆడోళ్ళయినా,మొగోళ్ళయినా తల్కాయల కూసింత ఇశారం జేస్కొనుడు ఉండొద్దా? గయన్ని ఒకలు జెప్తే వత్తాయి?ఎవలికాళ్ళకే తెల్వాలె గని. ఏందో ఏం మడుసులో అవ్వా! మనమేదన్న శెబ్దామన్న తప్పులు దీత్తరు.గందుకే "ఊరుకున్నంత ఉత్తం లేదు-బోడిగుండంత సుఖం లేదు" అంటరు."
 "ఏంది శెల్లోవ్! ఎవలేం జేశిర్రు.ఏంది ముచ్చెటి.పైంగ మనం శెప్పడం వల్ల  ఫాయిదా లేదంటున్నవ్!గంత శెప్తే సుత తల్కాయలకి ఎక్కిచ్చుకోరా? గదేం సక్కదనం శెల్లే!"
"అవునవ్వా!ఒకలి మాట యినేదేంది అన్కుంటరు గని గందులున్న మంచి శెబర శెప్పబోతె యింటరా ఏంది?"
 "అవునవ్వా! ఇంటిని జూసి ఇంటామె సక్కదనం శెప్పొచ్చు అంటరు గద.గట్లనే గీ నడ్మల మా సుట్టపోళ్ళ ఇండ్లల్లకెల్లినవ్వా! గాళ్ళ సక్కదనం  నీకు శెప్తనని వొచ్చినవ్వా!"
"అవునా శెల్లే!గయేందో శెప్పవైతివి.నాకు సుత ఎంతెల్లెం యినాల్నా అని కాయుషుగుంది.జల్ది శెప్పు శెల్లే!"
 " గట్లనే అవ్వా! సిల సిలా శెప్త యినుకో మరి. మొన్న ఐతారం మా అన్న బిడ్డకి వొల్లె గట్టిత్తరని ఎల్లిన గద. గజ్జూసుకున్నంక వొత్తుంటె వొదినె శేతులు బట్కొని శాన్నాళ్ళకి వొచ్చినవ్. రెండు దినాలు ఉండి పొమ్మని ఒక్క తీర్గ అనబట్టింది.గంద్కనే వున్న. తెల్లారి పొద్దుగాల వొదినె బెట్టిన మురుకులు,ఓ  బూంది లడ్డు తిని, వొదినె సుట్టపామె ఇంటికి బొయ్యినవ్వా!"
 "ఇంట్లె! తీరొక్క సామానుంది గని గయ్యన్ని పట్నంల మూజింల బెట్టినట్టున్నయ్.గవి జూసి శిత్రమనిపిచ్చింది. అవుస్రం ఉన్నయ్ లేనివి గట్ల కొనుడెందుకు ఇంట్లె పట్టు సాలకుండ బెట్టుడెందుకు అన్కున్న. ఇంగ ఇంటెన్కకి బోతే అవ్వా! నువ్వేమన్న అను గని కొత్త పాత వత్తువులన్ని ఓ శెత్త కుప్పోలోలె  ఆడాడ పడేశున్నయ్. గయ్యి గన్క పేద సాదోడికిత్తే పతొక్క వొత్తువు పన్కొత్తది.తీస్కొన్నోడు తల్సుకుంటడు.  గన్నన్ని పైసలు బోశి కొని గట్ల బడేసుడు సూత్తె నాకే ఎట్లనో అనిపిచ్చింది అవ్వా!"
 "గందుకే అంటరు శెల్లే "ఇగురం తప్పినమ్మ ఇంటెనుక సూడుమని"  ఊకెనే అన్లే శెల్లే! గిట్లనే పైసల యిల్వ తెల్వకుండ కర్సు శేత్తరు.రేప్పొద్దుగాల ఏదన్న ఆపదొత్తె తెల్లమొగాలేసి మందొంక సూత్తరు శెల్లే. బలే ముచ్చెటి శెప్పినవు.''
"అప్పుడే ఏమైందవ్వోవ్! ఇంకో  ముచ్చెటి వుంది.గది సుత ఇను మల్ల."
 "శెప్పు శెప్పు శెల్లే! నువ్వు శెప్తుంటే నాకు సైన్మా లెక్క కండ్లకి అగుపిత్తున్నది."
 "గట్లనా అవ్వా! ఇంగ గా ఇల్లు జూసినగద మల్ల వొదిన తానకొచ్చి అన్నం దిన్న.నేనొచ్చిన్నని కాయి కూర,కొర్రమీను శేప ముక్కలు మంచిగ నూనెల గోలిచ్చి పెట్టింది.వొద్దొద్దంటే 'ఎహె! ఏందొదినా ?గట్ల మొగమాటం జేత్తవన్కుంట కెక్కరిల్ల బెట్టింది. గద్దినంగనే కండ్ల మీదికి నిద్దుర దూక్కుంటొచ్చిందవ్వా! సోయి లేకుండా రొండు గంటలు పండిన దాన్ని పండినట్టే వున్న.వొదినే లేపిందాక లెవ్వనే లేదదవ్వా! లేశి మొగం గడ్గి జెర నెత్తి దువ్వుకున్నంక మత్తొదిలింది.'గీ పయానాలల్ల నీళ్ళు సరింగ దాగం ఏడి జేత్తది వొదినా! గీ సల్లసుక్క తాగుమని' పెద్ద గిలాసెడు సల్లల లేత కల్యమాకు,కోతి మీర, జిల్కర పొడేసి ఇచ్చిందవ్వా! గద్దాగినంక కడ్పు సల్లబడ్డది. 'వొదినా! ఇంకో సుట్టపామె ఇంటికి తోల్క బోత వొత్తవా అంటే సరే అనంగనే మూడిండ్లవతలున్న గాల్లింటికి తోల్కపొయ్యింది. గామె నన్ను సూడంగనే శేటంత మొగం జేస్కొని బాగున్నవా వొదినే! మా అక్క ఎప్పుడు నిన్నే తలుత్తది అన్కుంట నోటికిరాం లేకుండా ముచ్చెటి శెప్పుకుంట వొంటింట్లెకి బొయ్యింది.గామెనకాల మేం సుత బొయ్యినం అవ్వా! గక్కడ సూత్తుంటే వోకారమే వొచ్చిందన్కో! శింకు నిండ,పొయ్యి గట్టు మీద ఎంగిలి బోల్లే. అక్కడో వత్తవు ఇక్కడో వత్తువు యుద్దంల తల్కాయలు కాళ్ళు శేతులు తెగి శిల్లం కల్లం పడుంటయి సూడు గట్లన్నయ్.గామె పొద్దత్తమానం గంతగనం సేశే పనేముందవ్వా! మాకు శాయ్ బెడ్తనన్నది గని గదేదో బండ మీదెత్తుకున్నట్టు అనపసోపాలు బడ్తున్నది అన్కున్న . నాకైతే అవ్వా! గాడ ఒక్క శనం సుత ఉండబుద్దిగాలేదు. ముండ్ల మీదున్నట్టు అన్పిచ్చింది. 'శాయొద్దు గీయొద్దు ' అన్కున్న.గంద్కనే మా వొదిన్ని తొందరబెట్టి ఇంటికివొచ్చినం.కండ్లు మూశినా తెర్శినా గా వొంటిల్లే కండ్లల్ల మెదలబట్టింది. ఏం మడిషవ్వా ఇల్లు సక్కంగ సగబెట్టుకోవాలని తెల్వక బోతె ఎట్ల శెప్పు గంతోపిక లేకపోతే ఎవల్నన్న శేతికింద బెట్కోవాలే. గదవ్వా!"
"అవును శెల్లే! ఒగ్గెం దప్పినమ్మ వొంటిల్లు సూడుమని ఊకెనే అన్లే."
 "బలే గన్నవ్ అవ్వా! ముందుగాల ఇగురమన్నవ్! గిప్పుడేమో ఒగ్గెం అంటున్నవ్ అర్తం కాలే అవ్వా!"
"గదా శెల్లే! ఇగురం అంటే పొదుపు.ఒగ్గెం అన్నా ఓగెం అన్నా ఒకటే...ఓపిక,పనితనం. అని అర్తం శెల్లే!"
"ఓష్నీ బలే శెప్పినవ్ అవ్వా!  గాల్లిద్దర్కి మంచిగ అత్కినట్టు శెప్పినవ్!"
గదండీ సంగతి! "ఇగురం తప్పినమ్మ ఇంటెనుక జూడు-ఓగెం తప్పినమ్మ వంటిల్లు జూడు"అంటే గిదే మరి. గట్ల ఆడోళ్ళు ఒక్కలే కాదురల్లో గిస్మంటి మొగోళ్ళు సుత వుంటరు."
కామెంట్‌లు