గొప్ప మనసున్న వ్యక్తి ఎంజీఆర్: - - యామిజాల జగదీశ్


 ఆయన ఎదిగి పెద్ద నటుడైన తర్వాత, ఒకప్పుడు తను పని చేసిన 'నెప్ట్యూన్' స్టూడియోను కొనుగోలు చేసి, దానికి తన తల్లి పేరు మీద 'సత్య స్టూడియో' అని పేరు పెట్టారు. ఆయన మరెవరో కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్. ఎం.జీ. ఆర్ అనే పేరుతో కోట్లాది మంది హృదయాల్లో ఎప్పటికీ చెరగిపోని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప మనసున్న వ్యక్తి.
అదే స్టూడియో ఫ్లోర్‌లో పూర్వం పనిచేసిన 'అప్పన్' అనే ఉద్యోగి ఇంకా అక్కడే పని చేస్తుండటం చూసి, ఆయనను తన దగ్గరకు పిలిచారు.. "ఏంటి అప్పన్ గారు, ఎలా ఉన్నారు?" అని అడిగారు.
"బాగున్నాను అయ్యా.." అన్నాడు అప్పన్. 
"పాత నెప్ట్యూన్ స్టూడియోలో ఇదే ఫ్లోర్‌లో మీకు ఎంత జీతం ఇచ్చేవారు?" అని అడిగారు ఎంజీఆర్.
అప్పన్ తను తీసుకునే జీతం ఎంతో చెప్పగా.. "సరే, వచ్చే నెల నుండి మీకు రెట్టింపు జీతం ఇస్తాను. కానీ ఒక చిన్న విషయం..." అన్నారు.
"ఒకప్పుడు నేను ఇదే ఫ్లోర్‌లో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ (సహ నటుడిగా) వేషం వేస్తూ, ఆ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో కింద నేలపై కూర్చున్నాను...
అప్పుడు మీరు ఒక జగ్గుతో ఏదో తీసుకువెళ్తుంటే, అది తాగునీరు అనుకుని నేను మిమ్మల్ని కొంచెం నీళ్లు అడిగాను.
కానీ మీరు మాత్రం.. 'ఇది నీళ్లు కాదు జ్యూస్, ఇది నీలాంటి వాళ్ల కోసం కాదు' అని చెప్పి నన్ను దాటి వెళ్ళిపోయారు..." అని గుర్తుచేశారు.
దాంతో అప్పన్ కంగారుపడి, భయంతో.. "అయ్యా, అప్పట్లో నాకు మీ గురించి తెలీదు, ఇప్పుడు ఆ విషయం అస్సలు గుర్తులేదు అయ్యా.." అన్నాడు.
దానికి ఆ మహానుభావుడు నవ్వుతూ.. "పరవాలేదు... ఇకపై ఈ స్టూడియో ఫ్లోర్‌లో ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఇవ్వాలి... అందుకోసమే ఈ జీతం పెంపు!" అన్నారు ఎంజీఆర్ అనే మహానుభావుడు...
ఆయనే అన్నా డీఎంకే (AIADMK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు!
ఎం.జీ.ఆర్ గారి ఉదారతను, అపకారికి కూడా ఉపకారం చేయాలనే ఆయన గుణాన్ని ఈ కథనం ఓ ఉదాహరణ.
కామెంట్‌లు