స్వభావపూర్ణత వున్నప్పుడే బాల సాహిత్యం వర్దిల్లుతుందని, బాలలకు అందుతుందని నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగిన డాక్టర్ నలిమెల భాస్కర్ బాలల పాటలు “పిల్ల తెమ్మెరలు” పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా , ఆవిష్కర్త గా మాట్లాడారు. ఆనందం, అనుభూతి ప్రధానమైతే ప్రభోదం, బోధన, నీతి నిజాయితీలు తర్వాత అంటూ బాల సాహిత్యం ఎక్కడైనా ఒక్కటే అని వాళ్లకు సాహిత్యం అందినప్పుడే ఆ తరం వర్దిల్లుతుందని ఆయన అన్నారు.
అన్ని భాషల్లోని బాలసాహిత్యం
అవలోకించే అవకాశం తనకు కలిగిందని భారతీయ భాషలలో బాల సాహిత్యం ఇంకా ఎక్కువగా పిలవడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆత్మతో ప్రేమగా చదివేవారు పిల్లలు మాత్రమే. మానేరు తీరo చాలామంది కవులు తయారు చేసిందని, భాస్కర్ కవి కాకుండా గొప్ప మానవతా వాది అని చెప్పారు. ప్రముఖ బాల సాహిత్య వేత్త వి ఆర్ శర్మ మాట్లాడుతూ తనకు అనేక సంవత్సరాల నుంచి భాస్కర్ తో అనుబంధం ఉందని పేర్కొంటూ ఈ పుస్తకంలోని పాటలు తొలిసారిగా వినే అవకాశం తనకే దక్కిందన్నారు. తనకు నచ్చినట్లు జీవించడమే భాస్కర్ ఆరోగ్య రహస్యమని భాస్కర్ ఏ కవిత రాసినా చాలా గొప్పగా ఉంటుందన్నారు. బాల సాహిత్య గుణాలలో ఆనందం, విజ్ఞానం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరొక ప్రముఖ బాలసాహితీవేత్త గరిపల్లి అశోక్ మాట్లాడుతూ పిల్లల్లో గొప్ప సృజనాత్మకత దాగి ఉందని దాన్ని వెలికి తీస్తే అనేక గొప్ప పుస్తకాలు వెలువడుతాయని తెలిపారు. పిల్లల ఆలోచనలు విశాలమైనవని తెలిపారు . భాషా ప్రయోగాలు అనేకం పుస్తకం లో ఉన్నాయన్నారు. ప్రముఖ కవి కూకట్ల తిరుపతి మాట్లాడుతూ భాస్కర్ గొప్ప భాషావేత్త అని పేర్కొన్నారు. ఆయన సూచనతోనే బాలసాహిత్యంలో బాలశిక్షను రూపొందించానని అది దక్షిణ ఆఫ్రికాలో తెలుగువారికి పాఠ్యపుస్తకంగా ఉందన్నారు. కవి గాయకుడు విమర్శకుడు అన్నాడి గజేందర్ రెడ్డి పుస్తకంలో ఉన్న పాటలను చక్కగా గానం చేసి అందులో ఉన్న విశేషాలను వివరించారు. సంస్థ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్ సభకు అధ్యక్షత వహించి సమైక్య సాహితి అనేక విశిష్ట కార్యక్రమాలను చేపడుతూ ఉండటం ఆనందంగా ఉందన్నారు. పుస్తక రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ మాట్లాడుతూ అందరి ప్రోత్సాహంతోనే ఈ బాలల పాటలు వెలువరిస్తున్నానని తెలిపారు. ఈ పుస్తకంలోని పాటలను వీడియో రూపంలో చిత్రీకరించిన కవి మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పటినుండే పిల్లల్లో సృజనాత్మకత ఉండేలా రచనల ద్వారా కృషి చేయాలని తెలిపారు అలాగే తన మనవరాలు ఔచిత్య ఈ పుస్తకానికి కవర్ పేజీ డిజైన్ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్, సంస్థ ప్రధాన కార్యదర్శి కె ఎస్ అనంతా చార్య, కాండూరి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. అనంతరం అతిథులను సన్మానించారు. కవులు రచయితలు ఈ కార్యక్రమంలో అధికంగా పాల్గొని విజయవంతం చేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి