ద్రౌపది: - యామిజాల జగదీశ్


 మహాభారత యుద్ధం ముగిసి చాలా రోజులైంది. విజయం పాండవుల వైపు నిలిచినా, ఆ గెలుపు తెచ్చిన సంతోషం ఎవరి ముఖంలోనూ కనిపించడం లేదు. రణరంగంలో కూలిపోయిన లెక్కలేనంత మంది వీరుల జ్ఞాపకాలు, బంధువులను కోల్పోయిన ప్రజల రోదనలు, తల్లుల ఆక్రందనలు, భార్యల కన్నీళ్లు, తండ్రి లేని పిల్లల ఆవేదనతో హస్తినాపురం అంతా ఒక గంభీరమైన శోకసంద్రంలో మునిగిపోయింది.
ఒక సాయంత్రం వేళ, హస్తినాపుర రాజభవనపు ఎత్తైన మేడపై నిలబడి నగరాన్ని నిశ్శబ్దంగా చూస్తోంది ద్రౌపది. ఒకప్పుడు వీరుల సింహనాదాలతో, ప్రజల కోలాహలంతో కళకళలాడిన ఆ నగరం నేడు వెలవెలబోయింది. వీధుల్లో స్త్రీలే ఎక్కువగా కనిపిస్తు న్నారు. ఎందరో నుదుటన కుంకుమ లేదు. చేతులకు గాజులు లేవు. తెల్లని వస్త్రాలు ధరించిన విధవలు మౌనంగా నడుస్తున్నారు. పిల్లలు కొందరు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచక ఇటూ అటూ తిరుగుతున్నారు. వృద్ధులు తమ కుటుంబాలను కోల్పోయిన దుఃఖంలో నిస్సహాయంగా ఉన్నారు.
ఆ దృశ్యాలన్నీ ద్రౌపది మనసును తీవ్రంగా గాయపరిచాయి. 
"ఈ వినాశనానికి నేనే కారణమా? నా పగ, ప్రతీకారాలే ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నాయా?" అనే ప్రశ్న ఆమె అంతరాత్మను వేధించింది. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. విజయ కిరీటం తలపై ఉన్నా, ఆ గెలుపును అనుభవించలేని ఆవేదనలో ఆమె మునిగిపోయింది.
ఆ సమయంలో భగవాన్ శ్రీకృష్ణుడు మెల్లగా అక్కడికి వచ్చాడు. ఆయన రాకను గమనించిన ద్రౌపది అటువైపు తిరిగింది. ఆయనను చూడగానే అంతవరకు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా బద్దలైంది. కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. కొన్ని క్షణాల పాటు ఆమె మాట్లాడలేక పోయింది.
కృష్ణుడు ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ, "ద్రౌపదీ, నీ మనసును ఇంతగా కలచివేస్తున్నది ఏంటి?" అని మృదువుగా అడిగాడు.
ద్రౌపది ఏ సమాధానమూ చెప్పలేదు. ఆమె మౌనమే ఆమె వేదనను చాటి చెప్పింది. ఆమె మనసులోని భావా లను గ్రహించిన కృష్ణుడు చిరునవ్వు తో మాట్లాడటం ప్రారంభించాడు.
"ద్రౌపదీ, విధి అనేది మనుషులు అనుకున్నట్లు సాగదు. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తలిచే ప్రతి ఆలోచన కాలప్రవాహంలో ఒక బీజాన్ని నాటుతాయి. ఆ విత్తనాలే సమయం వచ్చినప్పుడు ఫలితాలుగా మారుతాయి. మనిషి తన చేతలను ఎంచుకోవచ్చు కానీ, వాటి వల్ల వచ్చే పరిణామాలను శాసించలేడు."
కొద్దిసేపు ఆగి ఆయన మళ్లీ చెప్పాడు.
"నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకు న్నావు... ఆ కోరిక నెరవేరింది. దుర్యో ధన దుశ్శాసనులే కాక, వారితో ఉన్న కౌరవులంతా నశించారు. నువ్వు కోరుకున్న న్యాయం లభించింది. కానీ ఈ రోజు నీ మనసు ఎందుకు ప్రశాం తంగా లేదు? ఎందుకు ఇంత దుఃఖంలో మునిగిపోయావు?"
ఆ మాటలు ద్రౌపది హృదయాన్ని గుచ్చాయి. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, "కృష్ణా, నా మనో గాయాలను మాన్పడానికి వచ్చావా? లేక వాటిపై ఉప్పు చల్లడానికి వచ్చావా?" అని బాధతో అడిగింది.
అందుకు కృష్ణుడు మందహాసం చేశాడు.
"లేదు ద్రౌపదీ, నిన్ను బాధపెట్టడానికి నేను రాలేదు. సత్యాన్ని బోధించడానికే వచ్చాను. జీవితంలోదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో తెలియ జేసేందుకు వచ్చాను."
ద్రౌపది కాస్త శాంతించి, "అయితే ఈ యుద్ధానికి నేనే కారణమా?" అని ప్రశ్నించింది.
"కాదు" అన్నాడు కృష్ణుడు. 
"ఈ యుద్ధానికి ఒక్కరినే బాధ్యులను చేయలేము. ఎందరో అహంకారం, ఆశ, క్రోధం, అసూయ, పగ, తప్పుడు నిర్ణయాలు.. ఇవన్నీ కలిసి ఈ మహా సంగ్రామాన్ని తెచ్చిపెట్టాయి. నువ్వు ఒక్కదానివే కారణం కావు, కానీ ఆ కారణాలలో నువ్వు కూడా ఒకదానివి అనే సత్యాన్ని కాదనలేము."
ఆ మాటలు ద్రౌపదిని లోతైన ఆలోచనల్లోకి నెట్టాయి.
కృష్ణుడు కొనసాగించాడు.
"నీ స్వయంవరంలో కర్ణుడిని అవమానించకుండా, అతడికి కూడా పోటీలో పాల్గొనే అవకాశం ఇచ్చి ఉంటే.. బహుశా కథ వేరేలా ఉండేదేమో. ఒక మనిషి మనసును గాయపరిచే మాట, అతడి జీవితాంతం రగిలే నిప్పులా మారుతుంది."
"ఆ తర్వాత కుంతీదేవి ఆదేశం ప్రకారం ఐదుగురికి భార్యగా ఉండటానికి నువ్వు అంగీకరించావు. ఆ సమయంలో నీ మనోభావాలను స్పష్టంగా చెప్పి, ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతికి ఉంటే.. బహుశా చరిత్ర మరోలా మారి ఉండేది."
"మయసభలో దుర్యోధనుడు కాలుజారి పడినప్పుడు, 'గుడ్డివాని కొడుకు గుడ్డివాడే' అని నువ్వు పరిహసించావని లోకం నమ్మింది. ఒకరి మనసును నొప్పించే మాట, ఎన్నో ఏళ్లపాటు చల్లారని పగగా మారుతుంది. ఆ అవమానం అతడికి క్రోధాన్ని మరింత పెంచింది."
"మనం మాట్లాడే మాటలు గాల్లో కలిసిపోతాయని అనుకుంటాం. కానీ అవి అవతలి వారి హృదయాల్లో చెరగని గాయాలు అవుతాయి. కొన్నిసార్లు ఒక మంచి మాట వేలాది మంది ప్రాణాల వినాశనానికి దారి తీస్తుంది."
ద్రౌపది మౌనంగా తలదించుకుంది. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను గుర్తుచేసుకుంది. కోపంలో మాట్లాడిన మాటలు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు అన్నీ ఆమె కళ్లముందు కదలాడాయి.
కృష్ణుడు మళ్లీ చెప్పాడు.
"మనిషి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఈ మాట ఎవరి మనసైనా నొప్పిస్తుందా? ఎవరి గౌరవానికైనా భంగం కలిగిస్తుందా? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు వస్తాయి? అని యోచించి మాట్లాడాలి. నాలుకకు ఎముక లేదు, కానీ అది చేసే గాయాలు కత్తిపోట్ల కంటే లోతైనవి."
"కోపంలో మాట్లాడే మాట బంధాలను తెంచుతుంది. అహంకారంతో అనే మాట పగను పెంచుతుంది. అదే ప్రేమతో పలికే మాట విరిగిన హృదయాలను కూడా అతికిస్తుంది."
"అందుకే మనిషి తన మాటలను ధర్మబద్ధంగా ఉపయోగించాలి. మంచిని తలచాలి, మంచిని మాట్లాడాలి, మంచిని చేయాలి. అప్పుడు విధే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది."
కృష్ణుడి ప్రతి మాట ద్రౌపది మనసులో బలంగా నాటుకుంది. ఆమె కళ్లలోని నీరు మెల్లగా ఆగింది. మనసు తేలికైంది. జరిగిపోయిన దాన్ని మార్చలేమని ఆమె గ్రహించింది. కానీ ఇకపై తన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో మరింత వివేకంతో, మెలకువతో ఉండాలనే నిశ్చయం ఆమెలో కలిగింది.
జీవితంలో చాలా సందర్భాలలో ఆయుధాలు చేసే గాయాలు, మాటలు చేసే గాయాలు చాలా లోతైనవి. మనిషి పళ్లలో విషం లేకపోయినా, అతడు మాట్లాడే మాటల్లో విషం ఉండవచ్చు. అవే మాటలు అమృతంగానూ మారవచ్చు. అది మనిషి ఆలోచనను, గుణాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి మనం పలికే ప్రతి మాట అవతలి వారి మనసును ఉల్లాసపరుస్తుందా లేక గాయపరుస్తుందా అని ఆలోచించి మాట్లాడాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులే మనిషి జీవితాన్ని ఉన్నతంగా మారుస్తాయి. అవే ప్రశాంతమైన ప్రపంచానికి, ఆనందకరమైన భవిష్యత్తుకు పునాది అవుతాయి.
కామెంట్‌లు