సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత-276: - ఇంట గెలిచి రచ్చగెలవమన్నట్టు
**
"ఒరేయ్ వారీ! ఇప్పటికి లచ్చత్యేపల శెప్పిన. నువ్వు ఏం జేత్తున్నవో తెల్వకుండ పైసలిచ్చేతందుకు నేనేమన్న ఎడ్డెదాన్నా? పైసలు ఊకెనే వత్తయా? నీ నాయిన నేను రెక్కలు ముక్కలు జేస్కొని ఇల్లు ఎల్లదీత్తున్నం.గిప్పటి దన్క సద్వన్నవు.ఉజ్జోగాలొచ్చే పరీచ్చలన్నవ్. అడ్గినప్పుడల్లా మీ నాయిన గులుక్కున్నా , తిట్టినా గయ్యి నేనే బరాయించి గా పైసలు నీ శేతుల బెట్టిన.నువ్వు  గాల్లేదో అడ్గేతప్పుడు నల్గుడు గుడ్డల్తో పోవద్దని బట్టలు, బాతలు కొనిత్తమి. గాటిని మల్లెపూల్లెక్క ఉతికి ఇత్రీ శేపిచ్చి ఇత్తిని. ఇంగ నా వొల్ల కాదురా. గిప్పటొరకిచ్చినయి శిన్న మొత్తాలు. గిప్పుడు గంత పెద్ద పైకం గావాలంటే నువ్వేమన్న అనుగని యియ్యడానికి మన్సురాట్లేదురా అయ్యా!"
 " అమ్మా! నేను మారిన్నే అంటే యినుకోవెందుకు. జెర యినుకోయే. గీ ఉజ్జోగాలు ఇంగ మాకు రావని తెల్సిపోయింది. గందుకే వాట్కి నీల్లొదిలినం. మా దోత్తుగాళ్ళం కల్శి బర్రెలు గొని గాటి పాలు , పెరుగు నెయ్యి  అమ్ముదాం అన్కుంటున్నం."
 " నాయినెంబడి ఎప్పుడన్న శేని కాడికి, శెలక్కాడికి పొమ్మంటెనే నసిగేతోనివి. గస్మంటిది బర్రెల్ని కొంటావ్. నల్గని బట్టలేస్కుని ఉజ్జోగం కోస్రం తిరగడమనుకున్నవా ఏంది? బర్రెలకి బాంచె శాకిరి జెయ్యాలే. ఊకెనే అన్కుంటున్నవ్ రా అయ్యా?"
 " గట్ల గాదె అమ్మా! నన్ను నమ్ము.గీ ఒక్కటే గాదు మనింటెన్కాల ఖాళీ తలంల కూరగాయలు,ఆక్కూరలు సుత పండిద్దామన్కుంటున్న. ఇగ్గో మా దోత్తులు సుత ఆళ్ళ ఇండ్లకాడ పండిత్తరంట."
 "ఏందిరా అయ్యా లొల్లి మీ యమ్మని ఒక్క తీర్గ వొద్దిత్తున్నం.గదేందో జెర జెప్పు. నువ్వు శెయ్యలేత్తవా లేదా నేన్జెప్త."
 "గదే అత్తా! గీడు ఉజ్జోగం జెయ్యకుండ ఇంటికాడ మట్లె పొర్లాడ్త అంటుండు.గీని శేత ఏమైతది. గా బర్రెలు సాదుడు,కూరగాయల సేద్దం శిటికెలో శేత్త అన్కుంటుండు. గీనొల్లేమైతది శెప్పు."
 " గాడు  బత్కు దెర్వు సూస్కుంట అన్నప్పుడు ఎందుకు ఎనక్కి గుంజాలె. సూద్దాం.ముందుగాల గా కూర గాయిల సేద్దం జెయ్యమందాం. గండ్లనే గీనికెంత శాతయితదో తెలుత్తది."
 " గట్లన్నవ్ మంచిగుంది అవ్వా! ఇంట్లె మీరు మెచ్చుకుంటేనే బయిటికి. సూత్తుండుర్రి నేనేం జేత్తనో..."
**
 " వామ్మో!  గీడు మాములోడు గాదె. గాని ఒంట్లెనే గాదు మన్సుల శత్తి మాగనే ఉంది.ఇంగ జూడు ఎన్ని కాయగూర్లను,ఆక్కూరల్ని పండిచ్చిండో... 'శెబ్బాస్ రా 'మన్వడా నువ్వు ఇంట్లె గెల్శినవ్ పో. ఇంట గెల్శినోడు బయిట సుత గెలుత్తడు."
 " అంటేందో సరింగ జెప్పు అవ్వా! నాకేం సమజైతలే!"
 " గదేరా వారీ!మూన్నెల్ల సయిమం ఇత్తే గా కూరగాయలు ఆక్కూరల్ని సంటి బిడ్డల్లెక్క సాది పంట దీశినవ్. నువ్వు శేయలేవని అమ్మ నాయినలు అనుకుర్రు గని గిట్ల నిన్ను జూసి మస్తు సంబుర పడ్తుర్రు. ఇంట్లె నువ్వు అన్కున్నది సాదిచ్చినవ్.ఇంగ బయిట గెల్వాలె రా అయ్యా!"
" అంటే నేనేం జెయ్యాల్నే అవ్వా?"
"నువ్వు పండిచ్చినయి తీస్కబొయ్యి అమ్ముక రావాలె మరి."
" గాదానికి సుత మా దోత్తుగాళ్ళం ప్లాను ఏశినం అవ్వా! మనూల్లె బాబాయి వోటల్ వుంది గద.గాళ్ళకి మేం పండిచ్చినయి ఏత్తమని శెప్పినం.అట్లనే తేండ్రి అన్నరు. గివ్వి మందులేయకుండ పండిచ్చినయి అంటే మస్తు సంబుర పడ్తుర్రు అవ్వా!''
 " మా నాయినే!మా కన్నే? నీయన్ని తాత బుద్దులే రా వారీ! '' సంబురంగ అంటున్న అవ్వని జూసి మన్వడు ఇంకాత్త దైర్నం దెచ్చుకున్నడు. 
గదండీ సంగతీ! " ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు"అంటే గిదే మరి".
కామెంట్‌లు