దూదిని వడికి దారం తీసి
బట్టలు నేసె బహుముఖ ప్రజ్ఞాశాలురం;
అతివల మనసును దోచే తీరున
అగ్గి పెట్టెలో పట్టే చీరను
నేసిన ఘనకుల వారసులం;
వేడుక కైనా వాడుక కైనా
సుతిమెత్తగ ఒంటిని హత్తుకుపొయే
పూల తీగలై అల్లుకుపోయే
చేనేత బట్టకు చేవ్రాలులం;
సౌఖ్యము నిచ్చి చౌకగ దొరికి
పేదల పాలిట అంగవస్త్రమై
కాయము దాచే కవచములై
ముతక బట్టలే మురిపించినవి
సాదా సీదా ఖద్దరులై;
ధగధగ మెరిసే దండి కుడుపులు
పసిడి కలిసిన పట్టు చీరలు;
దర్జా పెంచి హుందా నిచ్చే ధోవతులు
కండువ లాల్చీ పైజామాలు
నిండుగ వెలిగే మానవ మూర్తికి
నిత్య సంబరాలు...ఈ అంబరాలు;
ఒడలను దాచి ఒద్దిక నేర్చి
విలువలు పెంచే
వలువల తయారీదారులం;
వస్త్రము వదలక
హస్తము నమ్మిన నేతన్నలం;.
======================
చేనేత దినోత్సవ శుభాకాంక్షలతో 💐💐💐💐💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి