ది గివింగ్ ట్రీ' : - యామిజాల జగదీశ్
 


ది గివింగ్ ట్రీ' (ది గివింగ్ ట్రీ) కేవలం పిల్లల పుస్తకం మాత్రమే కాదు. అదొక గాయం. అదొక అద్దం. ప్రేమ, త్యాగం, ఇవ్వడం, తీసుకోవడం, బంధాలు... ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను మనలో రేకెత్తించే కథ.
షెల్ సిల్వర్‌స్టీన్ రచించిన ది గివింగ్ ట్రీ, AI ద్వారా రూపొందించబడింది
షెల్ సిల్వర్‌స్టెయిన్ రాసిన ఈ పుస్తకం 1964లో వెలువడింది.
పిల్లలకు ఇది చాలా అయోమయంగా, మనసును కలచివేసేలా ఉందని భావించి మొదట్లో కొందరు పబ్లిషర్లు దీన్ని తిరస్కరించారు.
కానీ కాలక్రమంలో ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకులకు చేరువైంది. ఎన్నో భాషల్లోకి అనువాదమై, ఎన్నో తరాల బాల్యంలో, జ్ఞాపకాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
కథ చాలా సరళమైనది.
ఒక ఆపిల్ చెట్టు ఒక అబ్బాయిని ఎంతో ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి దాని కొమ్మల మీద ఆడుకుంటాడు, ఆపిల్ పండ్లు కోసుకుని తింటాడు, దాని నీడలో సేదదీరుతాడు. అబ్బాయి సంతోషంగా ఉంటే చెట్టు కూడా సంతోషిస్తుంది.
కాలం గడుస్తుంది. అబ్బాయి పెద్దవాడవుతాడు. అతనికి డబ్బు అవసరం వస్తుంది. చెట్టు తన ఆపిల్ పండ్లన్నీ అతనికి ఇస్తుంది. అతడు వాటిని అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు.
ఆ తర్వాత అతనికి ఒక ఇల్లు కావాలి. చెట్టు తన కొమ్మలను ఇస్తుంది. వాటితో అతడు ఇల్లు కట్టుకుంటాడు.
ఆ తర్వాత అతనికి ఒక పడవ అవసరమవుతుంది. ఈసారి చెట్టు తన కాండాన్ని ఇస్తుంది. అతడు దానితో పడవ తయారు చేసి దూరంగా వెళ్లిపోతాడు.
ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి.
వృద్ధుడిగా అతడు మళ్లీ ఆ చెట్టు దగ్గరకు తిరిగి వస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గర ఇవ్వడానికి ఆపిల్స్ లేవు, కొమ్మలు లేవు, కాండం లేదు. ఒక మోడు మాత్రమే మిగిలి ఉంది.
ఆ వృద్ధుడు ఆ మోడు మీద కూర్చుంటాడు.
చెట్టు సంతోషిస్తుంది.
నేను కూడా.
దీన్ని చదవడానికి కొన్ని నిమిషాలు చాలు. కానీ దీని అర్థాన్ని గ్రహించడానికి ఒక జీవితకాలం సరిపోతుందా అన్నదే ప్రశ్న.
చెట్టు నిజంగా త్యాగానికి ప్రతిరూపమా? లేక తన దగ్గరున్నదంతా ఇచ్చేసి శూన్యంగా మిగిలిపోయిన ఒక బాధితురాలా?
ఆ అబ్బాయి స్వార్థపరుడా? లేక జీవితపు అవసరాల్లో చిక్కుకుపోయిన ఒక సామాన్య మనిషా?
ఈ కథ తల్లికి ఉండే అంతులేని ప్రేమ గురించి చెబుతోందా? లేక ఒకరు ఇస్తూనే ఉండి, మరొకరు తీసుకుంటూనే ఉంటే బంధంలోని ప్రమాదాన్ని హెచ్చరిస్తోందా?
ఒక్కో పాఠకుడు ఈ కథలో ఒక్కో అర్థాన్ని వెతుక్కోవచ్చు.
ఒకరికి ఇది త్యాగంలోని అందంలా అనిపించవచ్చు. మరొకరికి ప్రేమ పేరుతో ఒకరు తమను తాము పూర్తిగా కోల్పోయే వేదనలా కనిపించవచ్చు.
ఈ పుస్తకంలో ఉన్న అతిపెద్ద గొప్పదనం ఇదే. ఇది మనకు ఏ జవాబూ చెప్పింది. దానికి బదులు, మన జీవితాన్ని, మన బంధాలను, మనం పంచే ప్రేమను వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది.
సిల్వర్‌స్టెయిన్ ఈ కథకు ఎలాంటి తుది వివరణ ఇవ్వలేదు. "ఇది ఒక చెట్టు, ఒక అబ్బాయికి సంబంధించిన కథ" అన్నంత వరకు దాన్ని వదిలేశారు.
బహుశా అందుకే 'ది గివింగ్ ట్రీ' ఇంకా మనల్ని వదిలిపోలేదు.
ఎందుకంటే, కొన్ని పుస్తకాలను మనం చదివి ముగిస్తాం.
కానీ కొన్ని పుస్తకాలు... మనల్ని చదవడం మొదలుపెడతాయి.


కామెంట్‌లు