ఇంతలో బయట ఏదో అలికిడి వినిపించింది. జయసేనుడు, మాంత్రికుడు ఇద్దరూ ఒకేసారి ఆతృతగా బయటికి తొంగి చూశారు. పరిచారిక నడిపించుకుంటూ వచ్చే అమృతవల్లి కాలి అందియలు ఘల్లుఘల్లుమనగా, ముంజేతి కంకణాలు గలగలలాడగా, అందమే సంభ్రమాశ్చర్యాలతో మురిసినట్టున్న సౌరాష్ట్ర యువరాణి అమృతవల్లి ఆగమనం. ఆమె ఇప్పుడు ఆ మాయావి వశంలో ఉంది; బాహ్య స్మృతి కోల్పోయింది. ఆమెను బలికోసం తయారుపరిచిన బల్ల ముందు కూర్చోబెట్టి, పరిచారికను వెళ్ళమని సైగ చేశాడు వక్రమల్లు.
ఆమె అందాన్ని చూసిన మాంత్రికుని హృదయం వశం తప్పినట్టయింది. "ఆహా! ఏమి సౌందర్యం! చూస్తూ చూస్తూ ఈ అందాల సుకుమారిని బలిపీఠం ఎక్కించాలా? పాపం! నా మాటలు నమ్మి, నన్నే పతిగా పొందాలని కలలుగన్న ఈమెను ఎందుకో మోసం చేయాలని అనిపించడం లేదు" అని, అంతలోనే తేరుకుని మనసును సమాధానపరుచుకుని అసలే నా పంచ ప్రాణాలు ఎవరో తెలియని అదృశ్య శక్తి నిర్వీర్యం చేసింది. నేనిప్పుడు జీవశ్చవాన్ని అయ్యాను.ఈమెను బలి ఇస్తేనే నా శక్తులు మరలా అదికమై నాకు యవ్వన ప్రాప్తి కలిగేది.నా ఈ కార్యంలో ఎలాంటి అడ్డంకులు రాకూడదు.ఇక ఏమాత్రం ఆలస్యం తగదు.అనుకున్నవాడై తన తాంత్రిక పూజను తీవ్రతరం చేశాడు. దృష్టిని కాళీమాతపై నిలిపి మంత్రోచ్చారణ గావిస్తున్నాడు. హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని చూసి జయసేనుడు చలించిపోయాడు. వక్రమల్లుపై అంతులేని కోపంతో రగిలిపోయాడు. తన కరవాలాన్ని చేతిలోకి తీసుకున్నాడు.యక్షుని మనసారా ప్రార్థించాడు.ఇంతలో వక్రమల్లు లేచి నిలబడ్డాడు. ఎదురుగా హోమగుండం రగులుతోంది. అమృతవల్లి తలను ఆ బలిపీఠం ముందుకు వంచమని ఆదేశించాడు. ఆమె అతను చెప్పిన విధంగా తలను ఆ బలిపీఠంపై మోపింది. ఆ మాయావి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించిన పెద్ద కత్తిని చేతిలోకి తీసుకుని, అమృతవల్లి వద్దకు అడుగులు వేస్తున్నాడు.
ఇక సమయం ఆసన్నమైనది. "మానవుని శక్తియో! తాంత్రిక మాయయో! తేల్చుకొను తరుణం రానే వచ్చింది. ఇంత దూరం రాగలిగినానంటే ఆ దైవం ఖచ్చితంగా నా వైపే ఉంది అని నా విశ్వాసం. మానవ ప్రయత్నంగా నా పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించి వాడితో పోరాడుతాను" ఎలాగైనా యువరాణిని కాపాడుతాను.ఆమెకు వీడి చెరనుండి త్వరగా విముక్తి కలిగించాలి.అని మనసులో తలచినవాడై, తన అదృశ్య రూపం వీడి నిజరూపంలోకి వచ్చి మాంత్రికునికి అడ్డంగా నిలిచాడు. ఆ హఠాత్పరిణామానికి జయసేనుని చూసిన వక్రమల్లు హతాశుడైనాడు. అప్పుడు జయసేనుడు, "ఓరీ మాయావి! ఇక నీ ఆగడాలకు, అరాచకాలకు అంతిమగీతం పాడుతాను. నాతో పోరాడి గెలువు. ఇక నీ కాలం చెల్లింది" అని పలికిన జయసేనుని మాటలకు, అతనిని చూసి విస్తుపోయిన వక్రమల్లు హస్తముద్రలతో జయసేనుని అడ్డుకోవాలని చూశాడు. అందుకు అవకాశమీయకనే, అంతకంటే వేగంగా జయసేనుడు కనురెప్పపాటు కాలంలో ఆ మాయావి హస్తాలను తెగ నరికాడు. వాడి నవనాడులూ ఒక్కసారిగా కృంగిపోయినట్టయి, నోటితో మంత్రోచ్చారణ చేయాలన్నంతలోనే "జై జగదంబికా!" అంటూ ఒక్క వేటున తలను మొండెం నుంచి వేరు చేశాడు. వాడి శిరసు ఆ బగబగ ప్రజ్వరిల్లే అగ్నిగుండంలో పడి క్షణంలో బూడిద కుప్పగా మారిపోయింది. మరుక్షణంలో!!!
:సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి