బీ కేర్ ఫుల్ : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497

 

వ్యక్తిత్వమేలేనోడు
 అబద్ధాలతో అంటకాగేటోడు
కపటనవ్వు పెదాలపై పులిమేటోడు
మాటల్లో తియ్యదనాన్ని వడ్డించేటోడు 
ఈకలికాలానికి ప్రతినిధి

చూపుల్లో ,నడకల్లో 
నాటనా వైదుష్యాన్నీ
చాటేటోడు
పరమకంత్రీలకు బాసైనోడు 

నిజాయితీ మనుషుల తలలు నరికెటోడు
మాటల్ని తేనిపూసిన కత్తుల్లా వాడేటోడు
మనుషుల మధ్య మంటలు రాజేసేటోడు
మానవత్వం కనుచూపు మేరలో కనబడనీయనోడు
విడదీయడం తప్పా
కలిసుండడం చూసి ఓర్వలేనోడు
మావారికి లోకానికి వాడే వాడే సామ్రాజ్యాధినేత

కులం మతం జాతి 
ఎందులోనైనా ఐక్యత రాగాన్ని 
తన కుట్ర బుద్ధితో విరిచేవాడు
గుంటనక్కను
టక్కరికొంగను మించిన 
కపటవేషధారి

అందుకే 
ఏ మనిషిలో
ఏ మాయావలయముందో
ఏ వక్రభాష్యం ఉందో
ఏం స్వార్థ ప్రయోజనముందో
నిశితంగా పరిశీలించు
నీనీడనే నువ్వు నమ్మే రోజులు కావివి 
ఆచితూచి అడుగులు వేయి
గుడ్డిగా ఏదీ ఎవరిని నమ్మకు
బీ కేర్ ఫుల్ 
నీ జాగురూకతే నీకు శ్రీరామ రక్ష 

కామెంట్‌లు