లోగుట్టు పైవాడికెరుక!?-(గుర్రం ఎగరనువచ్చు) : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497

 

ఇప్పుడంతా పాలక పార్టీ గాలే వీస్తుంది
ప్రతిపక్షం ఎండకు ఎండి వానకి నాని 
రేపటి ఓటు బ్యాంకు కోసమై
కసరత్తులు చేస్తోంది
నిరసనలు హర్తాళ్ళు 
రాస్తారోకోలు నిర్వహిస్తుంది 

ఏలునపుడు
ఏ శాఖను నిర్వీర్యం చేసామో
ఒక్కొక్కటిగా తరచి తరచి చూస్తూ
రాజకీయ రంకు డ్రామా ఆడుతుంది 

ఇప్పుడు పాలకపక్షం చేసే అభివృద్ధినంతా
డొల్ల అంటూ
గుడ్డుకు ఈకలుపీకుతుంది

ఒక్కోసారి ప్రతిపక్షం నోరుజారితే
పాలకపక్షం గంపగుత్తగా 
ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పనిలో బిజీగానే ఉంది 

ఏమైనా జరగొచ్చు 
డబ్బుతో పని
అధికారం హోదాతో పనిమరి
ఒక్కొక్కప్పుడు
కుంటిగుర్రాలైనా ఎగరనువచ్చు

ఇప్పుడు ప్రతిపక్ష అసంతృప్తులంతా
నాలుగు రకాల పార్టీ జెండాలు
నాలుగు రకాల పార్టీ షర్టులు రెడీ మేడ్ గా 
తయారు చేసుకొని రెడీగా ఉన్నారు
నిఖార్సైన రాజకీయాల్లేవు
అన్నీ నీతిమాలినవే

కామెంట్‌లు