ఆ రాత్రి కూడా భోజనాలయ్యాక ఐదుగురూ అరుగుమీదకి చేరారు. ఆకాశంలో చందమామ వెలుగులు చల్లుతోంది.
"అమ్మమ్మా! తొందరగా రా! ఈరోజు కొత్త కథ చెప్పాలి" అని కేకలు పెడుతున్నారు.
చేసేది లేక పని ఆపి వచ్చింది అమ్మమ్మ.
"అమ్మమ్మా! ఈ రోజు ఎవరి కథ?" అడిగింది మహతి.
"ఈ రోజు బాల అభిమన్యుడి కథ చెబుతాను" అంది అమ్మమ్మ.
"అభిమన్యుడు అంటే అర్జునుడి కొడుకే కదా?" అన్నాడు మహి.
"అవును నాన్నా. అర్జునుడి భార్య సుభద్ర. అభిమన్యుడు ఇంకా అమ్మ కడుపులో ఉండగానే ఒక అద్భుతం జరిగింది."
"అమ్మ కడుపులోనా? ఏమైంది అమ్మమ్మా?" ఆశ్చర్యంగా అడిగాడు కార్తికేయ.
"ఒకరోజు అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి చెబుతున్నాడు. అది యుద్ధంలో శత్రువులు చేసే గుండ్రని వలయం లాంటి వ్యూహం. లోపలికి వెళ్లడం తేలిక, బయటికి రావడం చాలా కష్టం. సుభద్ర వింటూ వింటూ నిద్రపోయింది. అందుకే వ్యూహంలోకి వెళ్లే మార్గం వరకే కడుపులో ఉన్న బాబు విన్నాడు."
"అమ్మో! అప్పుడే విన్నాడా!" అంది మయూఖ.
"అందుకే పుట్టాక చిన్నప్పటి నుంచే అభిమన్యుడు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు. విలువిద్యలో మహా నేర్పరి."
"నేను కూడా తెలివైనవాడినే!" అన్నాడు మిట్టు.
"ఔను నిన్న పజిల్ పూర్తి చేసావు కదా నీవు" అన్నది మహతి.
"పెద్ద యుద్ధం వచ్చింది. అందరు పెద్దవాళ్లు వేరే చోట పోరాడుతున్నారు. అప్పుడు శత్రువులు పద్మవ్యూహం పన్నారు. దాన్ని ఛేదించగలిగేవాడే మన అభిమన్యుడు. 'నేను వెళ్తాను పెదనాన్నా!' అన్నాడు. 'కానీ బయటికి రావడం నీకు తెలియదు కదా' అన్నారు పెద్దవాళ్లు. 'మీరంతా నా వెనకే రండి' అన్నాడు అభిమన్యుడు."
"అభిమన్యుడు భయపడలేదా?" అడిగింది మయూఖ.
"ఏమాత్రం లేదు తల్లీ. ధైర్యంగా లోపలికి వెళ్లాడు. కానీ శత్రువులు మోసంతో, అందరూ కలిసి ఒక్కడిపై దాడి చేశారు. చివరికి అభిమన్యుడు వీరమరణం పొందాడు."
పిల్లలంతా కాసేపు మౌనంగా ఉండిపోయారు.
"అయ్యో! పాపం" అంది మహతి నెమ్మదిగా.
"బాధపడకు తల్లీ. కొన్నిసార్లు గెలుపు కన్నా ధైర్యమే గొప్పది. చిన్న వయసులోనే అభిమన్యుడు ధైర్యంతో చరిత్రలో నిలిచిపోయాడు."
"అమ్మమ్మా, ఆయన పెద్దవాళ్ల మాట వినకుండా వెళ్లాడా?" అడిగాడు కార్తికేయ.
"లేదు నాన్నా. పెద్దలకు సాయం చేయడానికే వెళ్లాడు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏ పని చేసినా పూర్తిగా నేర్చుకుని చేయాలి. అభిమన్యుడికి బయటికి రావడం తెలిసి ఉంటే కథ వేరుగా ఉండేది."
"అంటే మనం ఏ పనైనా పూర్తిగా నేర్చుకోవాలన్నమాట!" అన్నాడు మహి.
"అవును. ధైర్యంతో పాటు తెలివి, నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉండాలి. పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి."
"నేను ఇక నుంచి టీచర్ చెప్పింది పూర్తిగా వింటా!" అన్నాడు మిట్టు.
"సాహస బాలుడు...కదా అమ్మమ్మా!" అంది మహతి.
అమ్మమ్మ ఐదుగురినీ ప్రేమగా దగ్గరకు తీసుకుంది. "మీరందరూ నా బుజ్జి అభిమన్యులు! ధైర్యంగా ఉండండి, బాగా నేర్చుకోండి."
చందమామ చిరునవ్వు నవ్వింది. ధైర్యవంతుడైన బాలుడిని తలచుకుంటూ పిల్లలు హాయిగా నిద్రపోయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి