స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము- 458 వ రోజు
గాంధారి శాంతించుట
ఆ మాటలకు శాంతించిన గాంధారి " మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ కీడు తలపెట్ట లేదు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే. నా కుమారుడి దుర్బుద్ధి, దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దుర్బోధలు కురు వంశ నాశనానికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నా కు మారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా ! " అని పలికింది. ఆ మాటలు విన్న భీముడు గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు " అమ్మా గంధారీ దేవీ ! నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా ! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది. నీ కుమారుడు ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమిని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మమం కాదా ! నేను క్షత్రియుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కురుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్న మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కురుసభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను " సుయోధనా ! అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము " అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు, చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు " అన్నాడు.
గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట
గాంధారి కొంత సేపు ఆలోచించింది " భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తోడలు విరుచుట ధర్మమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే ! కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా ! ఇది ధర్మమా ! " అని అడిగింది. భీముడు " సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా ! నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ చేసుకోవడానికి నేను అలా చేసాను. కాని నెత్తురు నోటికి తాకించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కురువీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా చేయకుంటే కురు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగేపాతకం చేసేంత దుర్మార్గుడినా ! నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి