మంచి కథల సమాహారం ఇట్లు విరిత :- టి. వేదాంత సూరి
 

కొన్ని కథలు చదువుతుంటే మన జీవితం లోని సంఘటనలు గుర్తుకు  వస్తుంటాయి.కథలు రాయడం నేర్చుకుంటే రాదు . అది కొందరికి సహజంగా అబ్బుతుంది. కథ  ముందు రచయిత స్పందించాలి. అప్పుడే కథ  పాఠకుడి ని ఆకట్టుకోగలుగుతుంది.  కథ చెప్పే విధానం తో పాటు సంఘటనలు, పరిసరాలు కూడా అందుకు దోహద పడతాయి. ఈ మధ్య మొలక కు విరిత గారు రచనలు చేస్తున్నారు. ప్రతి రచనకు పాఠకులనుంచి మంచి స్పందన వస్తుంది. అది చూసే మీ పుస్తకాలు ఏమైనా వచ్చాయా అని అడిగాను. కొత్తగా తన మొదటి పుస్తకం ఇట్లు విరిత వచ్చిందని చెప్పారు. వెంటనే దాన్ని తెప్పించుకుని చదవడం మొదలు  పెట్టాను.అసలు ప్రారంభించినప్పటి నుంచి ఆగ కుండా చదివిస్తున్నాయి. ఒక్కో కథ రెండు , మూడు పేజీలకంటే ఎక్కువ ఉండదు. ప్రతి కథ తరువాత ఒక నిట్టూర్పు, తీపి జ్ఞాపకాలు , అనుభవాలు , బాల్యం మనలను వెంటాడుతుంటాయి. ఎందుకంటె ఆ అక్షరాలను  ఆర్తి  ఆవేదన, ఆనందం , జ్ఞాపకాలలో ముంచి రాశారు . ఒడిబియ్యం కథ తెలంగాణ సంస్కృతి , అనుబంధాలకు అద్దం పడుతుంది. ఇది చదివిన ప్రచురణ కర్త వర లక్ష్మి గారు తాను తెలంగాణ ఆడబిడ్డనై పుడితే బాగుండేదేమో అనుకున్నారంటే తెలంగాణ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో మరో సంఘటన అప్పులు కథలో వుంది అది సంక్రాంతి ముందు తెలంగాణలో వుండే హడావిడిని చదవొచ్చు. పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ రోజుల్లో పిండి గిర్నీ పట్టించడం వుంది కానీ మా బాల్యం లో బియ్యం నానపెట్టి ,తెల్లవారుఝామున  రోలు పై కుందెన పెట్టి అందులో నానిన బియ్యం వేసి రోకలితో దంచుతూ పిండి చేసేవారు. దానితో అరిసెలు, సకినాలు చేసే వారు. సకినాలు చేయడం కూడా ఒక కళ .. పైగా పిల్లల కోసం తేళ్లు, పాములు, విసురు రవుతులు, పిడికిళ్లు  చేసి ఇచ్చేవారు. మిగిలిన పిండిని వృధా చేయకుండా పాల కాయలు చేసి ఇచ్చే వారు. కానీ ఈ తరం వారికి అవేం తెలియదు ఈ రోజుల్లో అన్ని హోమ్ ఫుడ్స్ లో యేడాదంతా సకినాలు దొరుకుతున్నాయి వారికి ఈ అనుభవాల స్మృతులు ఎక్కడ ఉంటాయి ఇక నా చిన్నప్పుడు చదివిన కథల్లో స్థానికత ఉండేది కాదు. అయితే రచయిత్రి బాల్యం కరీంనగర్ ప్రాంతం కావడం  వలన అక్కడి యాస , అలవాట్లు , ఊళ్ళ పేర్లు , సంప్రదాయాలు చదువుతుంటే నా బాల్య జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. అందుకే మరింత శ్రద్ధగా కథలు చదివాను. ఇందులోని  ప్రతి కథ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది.మరి కొంత ఉంటే బాగుండు అనిపించేలా ఉంటుంది. ఈ రచయిత్రికి మంచి భవిత ఉంటుందన్నది నా భావన . తెలంగాణ సంప్రదాయాలకు అద్దం పట్టే  మరిన్ని మంచి  కథలు రాయాలని ఆకాక్షిస్తున్నాను.
కామెంట్‌లు