సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము- 459 వ రోజు

 

గాంధారి ఆగ్రహం
గాంధారి అంతటితో ఊరుకోలేదు " భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే ! ఇది ధర్మమా ! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించ లేదా ! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా ! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా ! " అని పక్కకు తిరిగి " ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు " అని కోపంగా అరిచింది. ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ " అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును. నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా ! నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాగ్నిలో నన్ను దగ్ధం చెయ్యి. అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను అనుభవిస్తాను. బంధు మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల ఈ శరీరంలో ప్రాణం ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు " అని భోరున ఏడ్చాడు. ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి " నాయనలారా ! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి " అన్నది. హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు వెళ్ళారు.
పాండవులు కుంతీ దేవిని చూచుట
చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా స్పందించింది. పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాండవులను చూసి వారి తలలు నిమిరి భోరుమంది. " పాండు కుమారులార ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా ! అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక మూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి " అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి వెళ్ళారమ్మా ! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరుపేరు వరుసనా పిలిచింది.
గాంధారి ద్రౌపదిని ఓదార్చుట
ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ " అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా ! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం కాల మహిమ ఊరుకోమ్మా ! " అని ద్రౌపది ఓదార్చింది.
*స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు