అష్టమ వ్యసనం (కథ) -సరికొండ శ్రీనివాసరాజు: ----ఆ అడవిలో అన్ని జంతువులు ఐకమత్యంగా ఉండేవి. ఆ జంతువులకు ప్రమాదం వేరే అడవి నుంచి వచ్చిన జంతువుల ద్వారా, వేటగాళ్ళ ద్వారా జరిగేది ‌. అటువంటి అడవిలో ఓరోజు కుందేలు, జింక మాట్లాడుకుంటూ నడుస్తున్నాయి. ఎదురుగా కోతి వస్తుంది. అప్పుడు కుందేలు జింకతో "అదేంటి జింక మామా! కోతి బావకు ఏమైంది? తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా! చేతిలో ఏదో పట్టుకొని, చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు." అన్నది. "నిన్న నక్క మామ ఇచ్చిన విందుకు వెళ్ళాడు కదా! ఆ జిత్తులమారి నక్క తినకూడనిది ఏదో పట్టుపట్టి తినిపించినట్లుంది. ఆ దెబ్బకి పిచ్చి పట్టినట్లుంది‌. బాబోయ్! అసలే కోతి చేష్టలను భరిఃచలేము! ఆపై దానికి పిచ్చి పట్టింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అల్లుడూ!" అన్నది జింక. అయినా కుతూహలం ఆపుకోలేక కోతిని అడిగింది కుందేలు. "ఓ ఇదా! దీనిలో నుంచి మా యజమానితో మాట్లాడుతున్నాను." అన్నది కోతి. నక్కకు పై ప్రాణాలు పైనే పోయాయి. అనుమానం లేదు. ఈ కోతికి పిచ్చి పట్టింది. ఇక్కడ ఎవరూ లేరు. ఏమేమో మాట్లాడుతుంది అనుకుంది జింక. అప్పుడు కోతి తన చేతిలో ఉన్న దానిని సెల్ ఫోన్ అంటారని దాని గురించి వివరంగా చెప్పింది. "నేను ఈ అడవిలో ఉంటూనే అప్పుడప్పుడు మానవుల ఇండ్లలో ప్రవేశిస్తాను. ఎంతో ధనవంతుడు అయిన ఒక మానవుడు నన్ను మచ్చిక చేసుకున్నాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నాకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో నేను ఎక్కడ ఉన్నా మా యజమానితో మాట్లాడవచ్చు." అన్నది కోతి. ఈ సంభాషణ అంతా చెట్టు మీద ఓ రామచిలుక విన్నది. ఈ విషయం అడవి అంతా ప్రచారం చేసింది. ఈ విషయమై సింహం అడవి జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. కోతిని ఆ సెల్ ఫోన్ గురించిన వివరాలు అడిగింది. దాని ఉపయోగాలను సమస్తం వివరించి చెప్పింది కోతి. "అయితే మన అడవి జంతువుల అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. ఎక్కడ నుంచైనా ఆపద వస్తుంటే ఒకరికొకరు ఫోన్ చేసుకొని చెప్పుకొని, జాగ్రత్త పడవచ్చు." అన్నది నెమలి. "ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలోని పెద్ద పెద్ద అడవులను పరిశీలించి, మన అడవినీ అభివృద్ధి చేయవచ్చు." అన్నది చిరుత. "యూట్యూబ్ ద్వారా మన జంతువులపై తీసిన సినిమాలను చూడవచ్చు. మంచి వినోదం." అన్నది చింపాంజీ. ఇలా ఎవరికి అర్థం అయినది వాళ్ళు చెబుతున్నారు. "శభాష్! నేను చెప్పింది మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఓ ఎలకమ్మా! నీ ఆజన్మ శత్రువు పిల్లిని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టి, ఏడిపించవచ్చో చూడవచ్చు." అన్నది కోతి. "భలే! భలే!" అని ఎగిరింది ఎలుక. పిల్లి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏనుగు ఇలా అంది. "సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి అని అందరమూ అనుకుంటున్నాము. దీనివల్ల వల్ల నష్టాలూ ఉండవచ్చు. ఆలోచించండి మహారాజా!" అని సింహంతో అంది ఏనుగు. "ఈ ఏనుగు ఎప్పుడూ ఇంతే మహారాజా! తాను బాగుపడదు. మనల్ని బాగుపడనివ్వదు." అన్నది గుంటనక్క. అడవిలోని జంతువులన్నీ తమకు సెల్ ఫోన్లు కావాలని పట్టు పట్టాయి. సింహం అనుమతితో కోతి కోటీశ్వరుడు అయిన తన యజమాని చేత వేలాది సెల్ ఫోన్లు కొని చాలా జంతువులకు ఇచ్చింది. సెల్ ఫోన్ వినియోగంలో వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఇక అడవిలో అసలు సమస్యలు మొదలయ్యాయి. కొన్ని జంతువులు గంటల తరబడి ఫోన్లు మాట్లాడమో, వాటి ఆపరేటింగుతో గడిపి, ఆహారం కోసం వెతకడం మానేశాయి. ఫలితంగా వాటి పిల్లలు ఆకలితో అలమటించాయి. మరికొన్ని సెల్ ఫోన్లు మాట్లాడుతూ పరధ్యానంగా నడుస్తూ పెద్ద పెద్ద గోతులలో పడి మరణిస్తున్నాయి, మరికొన్ని ముళ్ళపొదలలో చిక్కుకొని, తీవ్ర గాయాలపాలు అవుతున్నాయి. మరికొన్ని చిన్న చిన్న గుంపులుగా కూడి, చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోయి, వేటగాళ్ళకు చిక్కుతున్నాయి. మరికొన్ని సెల్ మాయలో పడి కౄర మృగాలకు విందు అవుతున్నాయి. ఇలా అడవి జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒక కోతి మాట విని, ఎన్ని అనర్థాలను కొని తెచ్చుకుందో సింహం గ్రహించింది. అడవిలో సెల్ ఫోన్స్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించింది. ఎవరి చేతిలో సెల్ ఫోన్ కనిపించినా వారికి మరణదండన తప్పదని హెచ్చరించింది. కోతిని పిలిచి చివాట్లు పెట్టింది. చూశారా పిల్లలూ! మన పూర్వీకులు సప్త వ్యసనాలను పేర్కొన్నారు. ఈ సెల్ ఫోన్ అష్టమ వ్యసనం. దీని మాయలో పడితే మీకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి.


కామెంట్‌లు